📄 ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రూ.21 వేల కోట్ల లాభం.. ఎస్‌బీఐ జోరు

రూ.21 వేల కోట్ల లాభం.. ఎస్‌బీఐ జోరు

రుణాల వృద్ధితో పెరిగిన ఆదాయం.. మెరుగైన ఆస్తుల నాణ్యతతో బలమైన త్రైమాసిక ఫలితాలు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సత్తా చాటింది. ఏప్రిల్‌–జూన్‌ మధ్య మూడు నెలల్లో రూ.21,121 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.19,160 కోట్లతో పోలిస్తే లాభం 10.2 శాతం పెరిగింది. మార్కెట్‌ అంచనాలను మించి ఫలితాలు నమోదు కావడం విశేషం.

రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.46,992 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 15 శాతం వృద్ధి. రుణాల మొత్తం విలువ కూడా 18.6 శాతం పెరిగింది. రిటైల్‌, వ్యవసాయం, ఎస్‌ఎంఈ, కార్పొరేట్‌ విభాగాల్లో రుణాల విస్తరణ బ్యాంకు పనితీరుకు దోహదపడింది.

మొండి బకాయిల్లోనూ మెరుగుదల

మొండి బకాయిల విషయంలోనూ ఎస్‌బీఐకి ఊరట లభించింది. స్థూల ఎన్‌పీఏలు 1.49 శాతం నుంచి 1.47 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.39 శాతం నుంచి 0.38 శాతానికి తగ్గాయి. అయితే కొత్తగా ఒత్తిడిలోకి వచ్చిన రుణాలు (స్లిప్పేజీలు) పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై బ్యాంకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

రూ.110 లక్షల కోట్లకు చేరువలో వ్యాపారం

ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ.110 లక్షల కోట్ల స్థాయికి చేరువైంది. డిపాజిట్లు కూడా 9.73 శాతం పెరిగాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.80,032 కోట్ల వార్షిక నికర లాభం నమోదు చేసిన బ్యాంకు.. కొత్త ఆర్థిక సంవత్సరాన్నీ బలమైన ఫలితాలతో ప్రారంభించింది.

షేరు ధరకు జోష్‌

త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత ఎస్‌బీఐ షేరు ధర కూడా మార్కెట్‌లో గణనీయంగా పెరిగింది. పెట్టుబడిదారులు బలమైన లాభాలు, రుణాల వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యతను సానుకూలంగా తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!