కలెక్టర్ ఆదేశాలతో యాక్షన్.. సర్వే 49/6లో రెవెన్యూ ఆపరేషన్
భారీ పోలీసు బందోబస్తు.. సూరారంలో బుల్డోజర్లతో కూల్చివేతల ఆపరేషన్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 3: (నవజ్యోతి ప్రతినిధి) కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 49/6లో ఉన్న సుమారు 5 ఎకరాల భూమిలో సోమవారం రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి, అధికారులకు భద్రత కల్పించారు.

సమాచారం ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. జేసీబీల సహాయంతో అక్కడ ఉన్న గుడిసెలు, తాత్కాలిక షెడ్లు, గదులు తదితర నిర్మాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల సమయంలో కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఈ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కూల్చివేతల నేపథ్యంలో సర్వే నంబర్ 49/6 పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

