📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లోపాలను సరిచేసి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి !

లోపాలను సరిచేసి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి !

ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నాణ్యంగా పూర్తి చేసి, ఓటరు వివరాల్లోని లోపాలను సరిచేసి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ, లింగం, సంతకాలలో ఉన్న తప్పులను పూర్తిగా సరిదిద్దాలని సూచించారు.

సోమవారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డిజిటైజేషన్ పనులను సమీక్షించారు. గైర్హాజరైన, నివాసం మార్చుకున్న, మరణించిన, నకిలీ ఓటర్ల (ASDD) జాబితాలు, నో మ్యాపింగ్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

అర్హులైన ఓటరు తొలగిపోకుండా చర్యలు

ఓటరు జాబితాలోని లోపాలను క్షేత్రస్థాయిలోనే సరిచేయాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే రోల్‌బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి రికార్డులను పునఃపరిశీలించాలని సూచించారు.

బీఎల్‌వోల పనితీరుపై పర్యవేక్షణ

బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్వైజర్లు, ఏఈఆర్‌వోలు నిర్వహించే ధృవీకరణ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని, నిర్లక్ష్యం గుర్తించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏల సంతకాలతో సమావేశాల మినిట్స్‌ను ఎన్నికల శాఖ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం

85 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాల పరిశీలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దోషరహిత ఓటరు జాబితా లక్ష్యం

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు అన్ని పట్టణ జిల్లాల ఎన్నికల అధికారుల పనితీరును సమీక్షించిన ప్రధాన ఎన్నికల అధికారి, నో మ్యాపింగ్ కేసులు, ASDD కేసులు, పెండింగ్ ఎన్యూమరేషన్ ఫారాల పరిష్కారాన్ని వేగవంతం చేసి దోషరహిత ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎన్నికలు) శాఖ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!