మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం చారిత్రక విజయం: భట్టి విక్రమార్క
ప్రజా ప్రభుత్వ కృషితో సింగరేణి సంస్థ వరుస విజయాలను నమోదు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కైవసం చేసుకోవడం చారిత్రక విజయమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పందించారు.
నెల రోజుల్లో రెండో కీలక విజయం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి పరిరక్షణ, విస్తరణ, రాష్ట్ర ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇటీవల ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడం, తాడిచర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు లభించడం తర్వాత ఇప్పుడు మణుగూరు బ్లాక్ కూడా దక్కడం నెల రోజుల వ్యవధిలో సాధించిన మరో కీలక విజయమని తెలిపారు.
20 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తికి అవకాశం
మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌లో సుమారు 120 మిలియన్ టన్నుల జీ-8 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ గనిలో ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 20 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి భద్రత లభించడంతో పాటు మణుగూరు ఏరియా కార్యకలాపాలకు మరో రెండు దశాబ్దాలపాటు భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ రంగానికి బలం
ఈ బొగ్గు బ్లాక్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాను మరింత బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు. భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణిని మరింత బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
మరో రెండు బొగ్గు బ్లాక్‌లపై దృష్టి
గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనకుండా చేసి సంస్థ ప్రయోజనాలను దెబ్బతీశారని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తోందని, కోయగూడెం-3, సత్తుపల్లి-3 బొగ్గు బ్లాక్‌లను కూడా సింగరేణికి దక్కేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

