రెండు, మూడు రోజుల్లో పూడిక తొలగించాలని ఆదేశం.. చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఏవీ రంగనాథ్ !
హైదరాబాద్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
షేక్‌పేట హకీంషా విరాట్‌నగర్‌లో చెత్తతో నిండిపోయిన వరద కాలువను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. మీడియా కథనాలు, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీసీటీవీలతో నిఘా
పై ప్రాంతాల నుంచి భారీగా చెత్త కొట్టుకురావడంతో పాటు కొందరు నేరుగా కాలువలో వ్యర్థాలు వేయడం వల్ల సమస్య తీవ్రతరమైందని అధికారులు కమిషనర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఏవీ రంగనాథ్ షేక్‌పేట ఓయూ కాలనీ, మారుతినగర్, వివేకానందనగర్, అంబేడ్కర్ నగర్, ఎంజీ నగర్, హకీంషా విరాట్‌నగర్, బృందావన్ కాలనీ వరకు వరద కాలువ వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
చెత్త వేస్తే కఠిన చర్యలు
కాలువల్లో చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని సూచించారు. వరద కాలువలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు.
రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలి
జేసీబీల సహాయంతో కాలువలో పేరుకుపోయిన చెత్త, పూడికను రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తిగా తొలగించాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
© నవజ్యోతి తెలుగు డైలీ – 2026

