కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ చర్చ
హైదరాబాద్, నవజ్యోతి ప్రతినిధి టి. రాజగోపాల్ :
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైయస్సార్‌కు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్రాలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫోటోలు ముద్రించడం ప్రజలను అయోమయానికి గురిచేసింది. వైయస్సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో బీఆర్ఎస్ నాయకుల చిత్రాలు ఉండటంపై నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తికర రాజకీయ చర్చ సాగుతోంది. ఈ బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారు? వాటి వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఏమిటి? అనే అంశాలపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, వివిధ పార్టీల కార్యకర్తలు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

