మంచిరేవులలోని ఆక్టోపస్–గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అకడమిక్ బ్లాక్–I నిర్మాణానికి డీజీపీ సీవీ ఆనంద్ భూమిపూజ నిర్వహించారు. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2024 డిసెంబర్లో ఈ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.
గతేడాది ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రాంగణంలో 120 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైంది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య సుమారు 360కు చేరింది. కొత్త అకడమిక్ బ్లాక్ పూర్తయితే వచ్చే ఏడాది ఈ సంఖ్య 700–720కు పెరిగే అవకాశం ఉంది.
ఆర్మీ, సైనిక్ స్కూళ్ల స్థాయికి సరితూగే విద్యా ప్రమాణాలతో పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు ఇతర వర్గాల పిల్లలకు కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. హోంగార్డుల పిల్లలను కూడా ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోనున్నారు. నాణ్యమైన విద్యను అందుబాటు ఫీజుతో అందించడంతో పాటు మొత్తం సీట్లలో 50 శాతం సాధారణ విద్యార్థులకు కేటాయించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
పాఠశాలలో విద్యతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సాహస కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. క్రికెట్‌తో పాటు రాక్ క్లైంబింగ్, గుర్రపు స్వారీ వంటి సాహస క్రీడల్లో శిక్షణ అందించనున్నారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలు, ఇతర హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్లస్–2 వరకు విద్య అందించే సమగ్ర విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల విద్యా, పరిపాలనా, ఇతర అంశాల పర్యవేక్షణకు పలు ఉపకమిటీలను ఏర్పాటు చేశారు.
రాబోయే రెండు నుంచి మూడేళ్లలో వైఐపీఎస్ను ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నిర్మాణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం సమర్థవంతమైన పోలీసింగ్‌తో ముడిపడి ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తమ పిల్లల విద్య, భవిష్యత్తుపై పోలీసు సిబ్బందికి భరోసా కల్పిస్తే వారు విధులపై మరింత ఏకాగ్రతతో పనిచేయగలరని తెలిపారు.

