📄 ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భిక్కనూరు ఏం పాపం చేసింది?

భిక్కనూరు ఏం పాపం చేసింది?

ఒక్క ఫార్మాతో ఆగలేదా?.. ఇప్పటికే ఉన్న MSNతో పాటు వరుసగా బల్క్‌ డ్రగ్‌ ప్రాజెక్టులు.. విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ సరే.. గత అనుమతుల సమయంలో ఎందుకు లేదు?

బిక్కనూరు, సెప్టెంబర్‌ 8 (నవజ్యోతి ప్రతినిధి):

భిక్కనూరు మండలంలో ఫార్మా, రసాయన పరిశ్రమల అంశం మరోసారి చర్చకు వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలు కొనసాగుతున్న ప్రాంతంలో మరిన్ని ప్రాజెక్టులు, విస్తరణ ప్రతిపాదనలు తెరపైకి రావడంతో స్థానికంగా పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అవసరమే అయినా.. దాని ప్రభావం ప్రజలు, వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణంపై ఎలా ఉంటుందన్నది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒక్క ఫార్మాతో ఆగలేదా?

భిక్కనూరు ప్రాంతంలో ఇప్పటికే MSN సంస్థకు సంబంధించిన పరిశ్రమ కార్యకలాపాలు ఉన్నాయి. దీనికి తోడు బల్క్‌ డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ రంగానికి సంబంధించిన మరిన్ని ప్రాజెక్టుల పేర్లు ప్రభుత్వ రికార్డులు, వివిధ అనుమతుల ప్రక్రియల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కో పరిశ్రమను విడివిడిగా కాకుండా.. మొత్తం ప్రాంతంపై కలిపి పడే ప్రభావాన్ని అంచనా వేయాలా? అన్న ప్రశ్న ముందుకొస్తోంది.

2022లో తెలంగాణ నిపుణుల పర్యావరణ పరిశీలన కమిటీకి సంబంధించిన అజెండా పత్రాల్లో భిక్కనూరు ప్రాంతానికి సంబంధించి Gnaks Labs, Discovery Laboratories, Arwen Chem, Gnanis Pharma, VVR Organics, Fleming Laboratories వంటి పేర్లు కనిపిస్తున్నాయి. వీటి ప్రస్తుత స్థితి, అనుమతులు, ఉత్పత్తి సామర్థ్యం, భూమి వినియోగం, నిర్మాణ పరిస్థితిపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

అప్పటికే MSN ఉంది.. అప్పట్లో అవగాహన ఎంత?

భిక్కనూరు ప్రాంతంలో ఇప్పటికే MSN కంపెనీ ఉన్న సమయంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. అప్పట్లో ఫార్మా పరిశ్రమల వల్ల భవిష్యత్తులో నీరు, గాలి, వ్యవసాయం, పర్యావరణంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయన్న దానిపై స్థానిక ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అందుకే అప్పటి ప్రజాభిప్రాయ సేకరణలో చాలామంది ఒకే విధంగా పరిశ్రమలకు అనుకూలంగా అభిప్రాయం చెప్పారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే అప్పటి పరిస్థితులు, అప్పటి పరిశ్రమల సంఖ్య, ప్రస్తుతం ప్రతిపాదిత విస్తరణలు ఒకేలా ఉన్నాయా? అన్నది ఇప్పుడు పరిశీలించాల్సిన అంశం.

అప్పట్లో పూర్తి అవగాహన లేక చెప్పిన అభిప్రాయాన్నే.. మారుతున్న పరిస్థితుల్లోనూ తుది ప్రజాభిప్రాయంగా పరిగణించాలా?

ఫ్యూజన్‌ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ.. మరి గతంలో?

ఫ్యూజన్‌ హెల్త్‌కేర్‌ విస్తరణకు సంబంధించి జనవరి 7న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ విక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ జిల్లా అధికారి లక్ష్మీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో గ్రామస్థులు, రైతులు, యువత, రాజకీయ నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం  చేశారు.

నీటి వినియోగం, గాలి కాలుష్యం, వ్యవసాయ భూములు, పర్యావరణ ప్రభావాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ విస్తరణకు వ్యతిరేకంగా బిక్కనూరులో బంద్‌ కూడా నిర్వహించారు.

అయితే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఫ్యూజన్‌ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు, గతంలో ఇచ్చిన అనుమతుల సమయంలో ఏ విధమైన ప్రజాభిప్రాయ ప్రక్రియ జరిగింది? ఏ సందర్భాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు లభించింది? దానికి చట్టపరమైన కారణాలేంటి?

గత అనుమతుల పూర్తి చరిత్ర ఎక్కడ?

భిక్కనూరులో ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ఎప్పుడు అనుమతులు వచ్చాయి? ఎంత భూమి కేటాయించారు? ఎంత ఉత్పత్తి సామర్థ్యానికి అనుమతి ఇచ్చారు? నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? పర్యావరణ అనుమతులు ఎప్పుడు మంజూరయ్యాయి? అనే వివరాలు ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.

ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో అనుమతి ఇచ్చి వదిలేయకుండా.. ఒకే ప్రాంతంలో కాలక్రమేణా పెరిగిన పరిశ్రమలన్నింటినీ కలిపి పర్యావరణ ప్రభావాన్ని పరిశీలించారా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.

‘జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌’.. కాగితాలపైనేనా?

ఫార్మా పరిశ్రమల విషయంలో ‘జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌’ వంటి పర్యావరణ నియంత్రణ చర్యలు ఉంటాయని సంస్థలు చెబుతున్నాయి. అయితే అవి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్నది నిరంతరం పరిశీలించాల్సిన అంశం.

భూగర్భ జలాలు, ఉపరితల నీరు, గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగాయా? కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్ని సార్లు తనిఖీలు చేశారు? తనిఖీల్లో ఏం తేలింది? నీటి, గాలి నాణ్యత పరీక్షల నివేదికలు ఏమంటున్నాయి? ఉల్లంఘనలు ఏమైనా గుర్తించారా? అన్న వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి.

మినహాయింపు అంటే తప్పిదం కాదు.. కానీ కారణం చెప్పాలి!

కొన్ని పరిశ్రమల అనుమతి దరఖాస్తుల్లో ప్రజాభిప్రాయ సేకరణకు మినహాయింపు ఉన్నట్లు పేర్కొనడం కనిపిస్తోంది. ఉదాహరణకు Scikem Pharmaceuticals దరఖాస్తులో Fresh EC, Public Consultation మినహాయింపు అంశాలు ఉండగా, Gnanis Pharma దరఖాస్తులోనూ Public Consultation Exempted అని పేర్కొన్నట్లు సమాచారం.

అయితే మినహాయింపు ఉండటం మాత్రమే నిబంధనల ఉల్లంఘనకు ఆధారం కాదు. అసలు ప్రశ్న.. ఏ నిబంధన కింద మినహాయింపు ఇచ్చారు? దానికి వర్తించే పరిమితులు ఏమిటి? సంబంధిత అధికారి లేదా కమిటీ ఏ కారణాలు నమోదు చేసింది? అన్నది స్పష్టంగా తెలియాలి.

ఒక్కో పరిశ్రమ కాదు.. మొత్తం భిక్కనూరు ప్రభావం?

ఒక పరిశ్రమను విడిగా పరిశీలిస్తే ప్రభావం పరిమితంగా కనిపించవచ్చు. కానీ అదే ప్రాంతంలో బల్క్‌ డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌, రసాయన పరిశ్రమలు వరుసగా పెరిగితే నీటి వనరులు, వ్యవసాయ భూములు, గాలి నాణ్యత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల జీవన విధానంపై కలిపి ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది వేరుగా అంచనా వేయాల్సి ఉంటుంది.

అందుకే భిక్కనూరు ప్రాంతానికి సంబంధించి సమగ్ర పర్యావరణ ప్రభావ అధ్యయనం అవసరమా? ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు, విస్తరణలన్నింటినీ కలిపి ప్రభుత్వం పరిశీలించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫార్మాను బూచిగా చూపించి పాఠశాల తరలింపా?

మరోవైపు ఫార్మా పరిశ్రమల అంశాన్ని ముందుకు తెచ్చి బిక్కనూరులోని ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపైనే ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించడం ఆందోళనకరం.

అసెంబ్లీలో సమాధానం కావాల్సిన ప్రశ్నలు

  • భిక్కనూరు ప్రాంతంలో ప్రస్తుతం ఎన్ని ఫార్మా, రసాయన పరిశ్రమలు ఉన్నాయి?
  • ప్రతి పరిశ్రమకు ఎంత భూమి, ఎంత ఉత్పత్తి సామర్థ్యానికి అనుమతులు ఉన్నాయి?
  • గతంలో ఏ ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది? ఏవాటికి మినహాయింపు ఇచ్చారు?
  • మినహాయింపులకు చట్టపరమైన ఆధారం ఏమిటి?
  • MSNతో పాటు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ నివేదికలు ఏమంటున్నాయి?
  • భూగర్భ జలాలు, గాలి నాణ్యతపై తాజా పరీక్షల ఫలితాలేమిటి?
  • కొత్త విస్తరణలన్నింటినీ కలిపి సమగ్ర పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేశారా?

అభివృద్ధి కావాలి.. కానీ స్పష్టతతో!

పరిశ్రమలు రావడం అభివృద్ధికి అవసరమే. ఉపాధి, పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు అవి ఉపయోగపడొచ్చు. కానీ ఇప్పటికే పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో మరిన్ని ప్రాజెక్టులు వస్తున్నప్పుడు అనుమతులు, పర్యావరణ ప్రభావం, నీటి వినియోగం, ప్రజాభిప్రాయం, తనిఖీ నివేదికలు అన్నీ పారదర్శకంగా ఉండటం అంతే ముఖ్యం. అప్పటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న అవగాహనతో ఇచ్చిన అభిప్రాయాన్ని.. నేటి మారిన పరిస్థితులకు యథాతథంగా వర్తింపజేయాలా? అన్నదే భిక్కనూరు నుంచి వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.

— నవజ్యోతి ప్రత్యేక కథనం
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!