కామారెడ్డి జిల్లా, ఆగస్టు 29 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల
పంపిణీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార
కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ
సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు
స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడంతో పాటు.. నూతన PACS పాలకవర్గంతో
ప్రమాణ స్వీకారం చేయించారు.



అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత
ఇస్తోందని మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డుల
జారీ చేపట్టామని చెప్పారు.
కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సులభంగా పొందడంతో పాటు.. వివిధ సంక్షేమ
పథకాలకు అర్హత కలిగే అవకాశం ఉంటుందని వివరించారు. ఆరు గ్యారంటీలు,
ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, రైతు సంక్షేమ కార్యక్రమాలను
ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
రైతుల ఆర్థిక బలోపేతంలో PACS పాత్ర కీలకం
రైతు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని షబ్బీర్ పేర్కొన్నారు.
పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా
సహకార సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
PACSలను కేవలం రుణాలిచ్చే సంస్థలుగా కాకుండా.. రైతుల సమస్యలకు గ్రామస్థాయిలో
పరిష్కారం చూపే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. రైతు భరోసా, పంట రుణమాఫీ,
ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను
ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.
రామేశ్వరం పల్లి PACSకు కొత్త పాలకవర్గం
నూతన PACS చైర్మన్గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం
చేయగా.. పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. రైతులు ఉంచిన నమ్మకాన్ని
నిలబెట్టుకుని రాజకీయాలకు అతీతంగా అందరికీ సమాన సేవలు అందించాలని
వారికి సూచించారు.
బిక్కనూర్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్
కామారెడ్డి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
స్కూల్ అండ్ కాలేజ్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయని
షబ్బీర్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థను బిక్కనూర్ ప్రాంతంలో ఏర్పాటు
చేయనున్నట్లు తెలిపారు.
విద్యతో పాటు వైద్యం, రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఇతర మౌలిక వసతుల
అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నియోజకవర్గంలోని
ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా
అమలు చేస్తున్నామని, కొంత ఆలస్యం జరిగినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని
తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నామని
పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడంలో PACS చైర్మన్లు
కీలక పాత్ర పోషించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలోనే
సేవలు అందించాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధికి సమన్వయ కృషి
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పథకాలను సమన్వయంతో అమలు చేయడంతో పాటు
గ్రామీణ మౌలిక వసతులు, రైతుల ఆదాయం, యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి
సారిస్తున్నామని ఎంపీ తెలిపారు.
కార్యక్రమాల్లో పాల్గొన్న వారు
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు
కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ
చైర్మన్ రాజు, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, భీంరెడ్డి,
గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఇరేని సందీప్, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు,
ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు,
గ్రామస్థులు పాల్గొన్నారు.

