జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు పంపిణీ
సిరిసిల్ల, 15 ఆగస్టు (నవజ్యోతి ప్రతినిధి):
దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
శకటాల ప్రదర్శన..
వ్యవసాయ, ఉద్యానవన శాఖ, చేనేత జౌళి శాఖ, మత్స్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, అగ్ని మాపక శాఖ, ఆర్టీసీ, గృహ నిర్మాణ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, పౌర సరఫరాల, సర్వే అండ్ రెవెన్యూ శాఖ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పనులు, వివరాలు, పథకాలతో రూపొందించిన శకటాలు ప్రదర్శించారు.
స్టాళ్ల ప్రదర్శన
అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఉద్యానవన, పోలీస్ శాఖ, 17వ బెటాలియన్, అటవీ శాఖ, లీడ్ బ్యాంక్ తదితర శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులతో కలిసి పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, మంచి శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, నగదు అందజేసి .. అభినందించారు.
మహిళా సంఘాల సభ్యులకు ఈ స్కూటీ, ఈ ఆటోల పంపిణీ
స్త్రీ నిధి ద్వారా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ స్కూటీ, ఈ ఆటో లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ అతిథులతో కలిసి పంపిణీ చేశారు.
రూపాయలు లక్ష విలువైన ఈ స్కూటీలు 24 మందికి, రూపాయలు 14 లక్షల 25 వేల విలువైన ఈ ఆటోలను అందజేశారు.
120 కోట్లకు పైగా రుణాలు..
855 మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు రూ. 100 కోట్ల 12 లక్షలు, అలాగే 847 సంఘాలకు స్త్రీ నిధి రూ. 20 కోట్ల 66 లక్షల రుణాలను పంపిణీ చేశారు.
దివ్యాంగులకు..
టీవీ సీ సీ స్కీమ్ కింద జిల్లాలోని పలువురు దివ్యాంగులకు ఆటో, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ పంపిణీ చేశారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన దుంపేటి కుమారస్వామికి ఎలక్ట్రిక్ ఆటో, గుర్రంవాణిపల్లికి చెందిన కంది తిరుమల్ రెడ్డి, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కొమిరే పరశురాముకు హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ తో కలిసి అందజేశారు.
కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఏవో రాంరెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

