నాగ్‌పూర్, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్ హెడ్గేవార్ భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం దాదాపు తొమ్మిది దశాబ్దాలపాటు పూర్వీకులు చేసిన త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాకుండా దాన్ని నిలబెట్టుకోవడం కూడా నిరంతర కృషితోనే సాధ్యమని భగవత్ పేర్కొన్నారు. దేశం సంతోషంగా, సుభిక్షంగా, సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భారత్ 2047 నాటికి మరింత బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా ఎదిగి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
‘విశ్వగురువు’గా భారత్..
భారత్ ‘విశ్వగురువు’గా ఎదగాలన్న లక్ష్యానికి దేశంలోనే కాకుండా బయట కూడా కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని భగవత్ అన్నారు. అయితే దేశ ప్రజల ఐక్యత, బాధ్యతాయుతమైన ప్రవర్తన, నిరంతర కృషితో వాటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.
త్రివర్ణంలోని రంగాలకు ప్రత్యేక అర్థం
జాతీయ పతాకంలోని కాషాయ రంగు త్యాగం, కర్తవ్యబద్ధత, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందని భగవత్ వివరించారు. త్రివర్ణ పతాకం కేవలం జెండా కాదని.. దేశం కోసం చేసిన త్యాగాలను, పౌరుల బాధ్యతలను గుర్తుచేసే చిహ్నమని పేర్కొన్నారు.
చర్చ, ప్రతిపక్షం, నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమే
నాగ్‌పూర్‌లోని కస్తూర్చంద్ పార్క్‌లో యువతతో జరిగిన కార్యక్రమంలోనూ భగవత్ ప్రజాస్వామ్యంపై మాట్లాడారు. భిన్నాభిప్రాయాలు, చర్చలు, ప్రతిపక్షం, నిరసనలు ప్రజాస్వామ్యంలో సహజమైనవేనని.. అయితే వాటితో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు.
యువతే భవిష్యత్తు
దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని భగవత్ పిలుపునిచ్చారు. యువతలో ధైర్యం, బాధ్యత, దేశం పట్ల నిబద్ధత పెరగాలని, భవిష్యత్తుపై ఆందోళనలు వారి లక్ష్యసాధనకు అడ్డంకిగా మారకూడదని సూచించారు.
దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాల్లో వేడుకలు
ఢిల్లీలోని కేశవ్ కుంజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్‌కార్యవాహ కృష్ణగోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమం ప్రారంభంలో వందేమాతరం ఆలపించగా, అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతం నిర్వహించారు. ఐక్యమైన భారత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలవగలదని ఆయన పేర్కొన్నారు.
కోల్‌కతాలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబాలే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుతూ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

