ఉన్నత విద్య నుంచి ఉద్యోగం, స్వయం ఉపాధి దిశగా యువతులకు ప్రత్యేక శిక్షణ…
హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలోని 43 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న యువతుల కోసం ‘లాంచ్ గర్ల్స్’ సంస్థ మూడేళ్ల కెరీర్ రెడీనెస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థినుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సంస్థ తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు మెంటర్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం అందించనున్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ కోర్సు పాఠ్యాంశాలు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), ప్రపంచ బ్యాంకు పరిశోధనల ఆధారంగా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
2020లో స్థాపించబడిన ‘లాంచ్ గర్ల్స్’ సంస్థ ప్రస్తుతం దక్షిణాసియా, ఆఫ్రికాలోని 16 దేశాల్లో 14 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల 26 వేల మందికి పైగా యువతులకు విద్య, కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొంది. తెలంగాణలో 43 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడం మహిళల ఉపాధి, సాధికారత దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు.

