న్యూఢిల్లీ, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్‌కు నీటి విషయంలో భారత్‌పై నైతిక హక్కు లేదన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జల ఒప్పందాన్ని ‘అబేయన్స్’లో ఉంచగా.. దాన్ని కొనసాగించాలని హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తీవ్రంగా తిరస్కరించింది.
తనను తాను గుర్తించని మధ్యవర్తిత్వ సంస్థకు భారత సార్వభౌమ నిర్ణయాలపై ఎలాంటి అధికారం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.
ఉగ్రవాదం చేస్తూ.. నీళ్ల కోసం కోర్టులా?
పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని న్యూఢిల్లీ ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తోంది. పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలను పక్కనపెట్టి కేవలం నీటి ఒప్పందాన్ని మాత్రమే అమలు చేయాలని పాకిస్థాన్ కోరడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఉగ్రవాదం ఒక వైపు.. నీటి ఒప్పందం మరో వైపా?’
పొరుగు దేశంతో సాధారణ సంబంధాలు, ఉగ్రవాదం రెండూ కలసి సాగలేవన్నది న్యూఢిల్లీ వైఖరి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే భారత్ నుంచి నీటి సహకారం ఆశించడం ఆమోదయోగ్యం కాదన్నదే భారత వాదన.
1960 ఒప్పందం.. మూడు యుద్ధాల తర్వాత కూడా గౌరవించిన భారత్
1960లో కుదిరిన సింధు జల ఒప్పందం భారత్, పాకిస్థాన్ మధ్య మూడు యుద్ధాలు, అనేక ఘర్షణలు జరిగినప్పటికీ కొనసాగింది. పాకిస్థాన్‌లోని వ్యవసాయ భూముల్లో భారీ భాగం ఈ నదీ జలాలపై ఆధారపడి ఉంది. అయినప్పటికీ సరిహద్దు ఉగ్రవాదం, భద్రతా సమస్యల విషయంలో పాకిస్థాన్ వైఖరి మారలేదని భారత్ చెబుతోంది.
రాట్లే ప్రాజెక్టుపై హేగ్ ఆదేశాలు
హేగ్ కోర్టు సింధు జల ఒప్పందం అమల్లోనే ఉందని పేర్కొనడంతో పాటు జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుపై కొన్ని తాత్కాలిక పరిమితులు విధించింది. డ్యామ్ వాల్, పవర్ ఇంటేక్ నిర్మాణంలోని కొన్ని పనులను తటస్థ నిపుణుడి నిర్ణయం వచ్చే వరకు పరిమితం చేయాలని పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు నియమించిన తటస్థ నిపుణుడి నిర్ణయం 2027 జూలై నాటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆదేశాలను భారత్ తనపై వర్తించే చట్టబద్ధ ఆదేశాలుగా అంగీకరించడం లేదు.
పాకిస్థాన్ వ్యూహం బెడిసికొడుతోందా?
నీటి అంశాన్ని అంతర్జాతీయ న్యాయ వేదికకు తీసుకెళ్లడం ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం నీటి అంశాన్ని ఉగ్రవాదం నుంచి వేరు చేసి చూడటానికి సిద్ధంగా లేదని స్పష్టం చేస్తోంది.
ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై నీటి హక్కుల గురించి మాట్లాడుతూనే.. మరోవైపు భారత్ వ్యతిరేక ఉగ్రవాదంపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదన్నది న్యూఢిల్లీ ప్రధాన అభ్యంతరం.
నీళ్లు కావాలి.. ఉగ్రవాదం మాత్రం ఆపరా?
భారత్‌పై ఉగ్రదాడులకు మద్దతు ఇస్తూ.. అదే భారత్ నుంచి నీటి సహకారం కోరడం ఎంతవరకు న్యాయం? పాకిస్థాన్ ముందుగా ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోవాలన్న డిమాండ్ బలపడుతోంది.
హేగ్ కోర్టు తీర్పు పాకిస్థాన్‌కు తాత్కాలికంగా ఊరటనిచ్చినా.. భారత్ మాత్రం వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు. జాతీయ భద్రత, సార్వభౌమత్వం విషయంలో కఠిన వైఖరిని కొనసాగిస్తోంది.

