📄 ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ ఉక్కుపాదం!

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ ఉక్కుపాదం!

379 కేంద్రాల్లో తనిఖీలు.. 50 చోట్ల నిబంధనల ఉల్లంఘన.. 11పై చర్యలు
379
ప్రైవేట్‌ కేంద్రాల్లో తనిఖీలు
50
నిబంధనల ఉల్లంఘనలు
11
కేంద్రాలపై చర్యలు

హైదరాబాద్‌, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో ప్రైవేట్‌ ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 379 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా.. 50 కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. వీటిలో రెండు కేంద్రాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో పాటు మరో తొమ్మిది కేంద్రాల అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఏఆర్టీ, సరోగసీ చట్టాలను ఉల్లంఘించే కేంద్రాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు.

50 కేంద్రాల్లో అక్రమాలు

సిబ్బంది మార్పుల్లో నిబంధనలు పాటించకపోవడం, రికార్డుల నిర్వహణలో లోపాలు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు ప్రదర్శించకపోవడం, ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు పనిచేయకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

కొన్ని కేంద్రాలు రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న చిరునామాలకు భిన్నమైన ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

రోగులపై అదనపు భారం వద్దు

ఫెర్టిలిటీ చికిత్స పేరుతో రోగులపై అనవసర ఆర్థిక భారం మోపకూడదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రాల్లో వినియోగించే మందులు, ఇంజెక్షన్లు, వాటి తయారీ సంస్థలు, గరిష్ఠ చిల్లర ధరలను పరిశీలించాలని తనిఖీ బృందాలను ఆదేశించారు.

రాష్ట్రంలో 477 ఏఆర్టీ, సరోగసీ కేంద్రాలు

రాష్ట్రంలో ప్రస్తుతం 477 రిజిస్టర్డ్‌ ఏఆర్టీ, సరోగసీ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీటిలో 129 ఏఆర్టీ లెవల్‌-1 కేంద్రాలు, 226 ఏఆర్టీ లెవల్‌-2 కేంద్రాలు, 59 ఏఆర్టీ బ్యాంకులు, 63 సరోగసీ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ ఐవీఎఫ్‌ సేవల విస్తరణ

గాంధీ ఆసుపత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐవీఎఫ్‌ కేంద్రాల పనితీరును కూడా మంత్రి సమీక్షించారు. ఈ రెండు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 39,802 మందికి ఫెర్టిలిటీ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు.

ఇందులో 20,185 ఫాలిక్యులర్‌ స్టడీస్‌, 521 ఐయూఐ, 545 ఐవీఎఫ్‌ ప్రక్రియలు ఉన్నాయి. జిల్లాల వారీగా దశలవారీగా ఐవీఎఫ్‌ సేవలను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

పీసీ-పీఎన్‌డీటీ చట్టంపైనా నిఘా

ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల్లో 2,600 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 52 కేంద్రాల్లో నిబంధనలకు భిన్నమైన అంశాలు గుర్తించి, 37 ఉల్లంఘనలపై షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

అక్రమ లింగ నిర్ధారణకు పాల్పడుతున్నట్లు అనుమానం ఉన్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ సేవలను ప్రభుత్వ రంగంలో విస్తరించడంతో పాటు ప్రైవేట్‌ కేంద్రాల్లో నిబంధనల అమలుపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోగులకు నాణ్యమైన సేవలు, పారదర్శకమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!