98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి
తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమమైతే చర్యలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఆగస్టు 24 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు కొత్తగా చేర్చారంటూ జరుగుతున్న
ప్రచారంలో వాస్తవం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
స్పష్టం చేశారు. 22ఏ పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను
భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన
అవసరం లేదన్నారు.
2023 డిసెంబర్ 7 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, వివిధ కేటగిరీల్లో
ఎంత భూమి నిషేధిత జాబితాలో ఉందనే పూర్తి వివరాలను రికార్డులతో ప్రజల ముందు
ఉంచుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 22ఏకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో
98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చర్యలు
తీసుకున్నామని వెల్లడించారు.
22ఏ ఉద్దేశం ప్రభుత్వ భూముల రక్షణ
ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు కోర్టు
ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇతర కేటగిరీల భూముల వివరాలను
మంత్రి వెల్లడించారు. ఎంత భూమి 22ఏలో ఉంది.. ఎందుకు ఉంది.. ఎవరి భూమి..
ఏ కారణంతో నిషేధిత జాబితాలో చేర్చారనే ప్రతి అంశాన్ని రికార్డులతో
ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్
ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటమే 22ఏ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
నర్సాపూర్‌లో 522 ఎకరాల ప్రభుత్వ భూమి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో
122 ఎకరాలు, మరోచోట 400కుపైగా ఎకరాలు కలిపి సుమారు
522 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారాన్ని మంత్రి ఉదాహరణగా
ప్రస్తావించారు.
ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా
మార్చే ప్రయత్నాలు జరిగితే.. అలాంటి భూములను నిషేధిత జాబితాలో
పెట్టకూడదా అని మంత్రి ప్రశ్నించారు.
పోతిరెడ్డిపల్లిలో పాత అసైన్‌మెంట్ పేరుతో హక్కులు
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు
అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే
భూములపై హక్కులు సృష్టించి దారాదత్తం చేసిన వ్యవహారం గుర్తించామని
మంత్రి తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో 1,280 ఎకరాల సర్వే నంబర్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు
1,280 ఎకరాల విస్తీర్ణం ఉందని.. అందులో కేవలం రెండు
ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం
సర్వే నంబర్ పేర్కొనడంతో ముఖ్యమంత్రి నివాసంతో పాటు తన నివాసం కూడా
పీఓబీలో చేరిందని.. విషయం గుర్తించిన వెంటనే సరిచేశామని వివరించారు.
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తే చర్యలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172
ప్రభుత్వ భూమి కాగా, 173 ప్రైవేటు భూమిగా ఉందని మంత్రి తెలిపారు.
173 పేరుతో అనుమతులు తీసుకుని 172లో ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు
చేపట్టిన ఉదాహరణను వివరించారు.
“ప్రైవేటు సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ
భూమిలో నిర్మాణం చేస్తే.. ఆ భూమిని 22ఏలో పెట్టకూడదా?” అని
మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడటం తమ బాధ్యత అన్నారు.
నకిలీ జీఓలు.. బోగస్ మెమోలు.. ఫేక్ సర్టిఫికెట్లు
ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీఓలు,
బోగస్ మెమోలు, అధికారుల సంతకాలతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న
వ్యవహారాలను గుర్తించామని మంత్రి తెలిపారు. అక్రమార్కులపై
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తున్నట్లు
వెల్లడించారు.
మేడ్చల్ జిల్లాలో 2026 ఏప్రిల్ 22 తేదీతో జిల్లా కలెక్టర్ సంతకం
చేసినట్లు చూపించిన నకిలీ మెమో, జూన్ 2 తేదీతో స్పెషల్ డిప్యూటీ
కలెక్టర్ పేరుతో రూపొందించిన బోగస్ సర్టిఫికెట్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు
ప్రయత్నించిన వ్యవహారాలను గుర్తించామని చెప్పారు. సంబంధిత వ్యక్తులపై
ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
యూఎల్‌సీపై త్వరలో విధాన నిర్ణయం
అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం త్వరలో
విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా
నాదర్‌గుల్, మేడ్చల్–మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో యూఎల్‌సీ క్లియరెన్స్‌కు
సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు.
యూఎల్‌సీ క్లియర్ చేసుకున్న భూములకు సంబంధించిన జీఓలు, ఉత్తర్వులను
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
అవసరమైన పత్రాలు సమర్పిస్తే ప్రభుత్వం పరిశీలించి క్లియర్ చేస్తుందని
చెప్పారు.
సీఎస్-7, సీఎస్-14పై సిట్ దర్యాప్తు?
గత ప్రభుత్వ హయాంలో సీఎస్-7, సీఎస్-14కు సంబంధించిన భూ వ్యవహారంలో
2017లో ఓ భూస్వామి నుంచి ఎస్-క్లాస్ బెంజ్ కారు తీసుకుని ఐదు
డాక్యుమెంట్ల ద్వారా 811 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్
చేయించుకున్నారన్న ఆరోపణలపై ప్రధాన ప్రతిపక్షం కోరితే
సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తామని మంత్రి ప్రకటించారు.
📞 కామారెడ్డి నుంచి 44 ఫిర్యాదులు
22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు
1,162 కాల్స్ వచ్చాయని మంత్రి తెలిపారు. రిపీటెడ్,
ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు
ఉన్నాయని చెప్పారు.
- వ్యవసాయ భూములు – 547
- వ్యవసాయేతర భూములు – 433
- రంగారెడ్డి – 258
- మేడ్చల్ – 149
- సంగారెడ్డి – 82
- కామారెడ్డి – 44
- యాదాద్రి భువనగిరి – 40
- సిద్దిపేట – 35
24–36 గంటల్లో పరిష్కారం
ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22ఏ కేసుల్లో సుమారు 98 శాతం
స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని
పొంగులేటి తెలిపారు. 300కుపైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర
కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12–13 కేసులను మాత్రమే
తిరస్కరించినట్లు చెప్పారు.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి
వారం రోజుల్లోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని
ప్రకటించారు. 22ఏకు సంబంధించిన నిజమైన సమస్యలను
24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో
పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలను భయపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదని.. ప్రభుత్వ భూములను
కాపాడటంతో పాటు న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం
కూడా ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, ప్రతి రికార్డును ధ్రువీకరిస్తామని
మంత్రి తెలిపారు. తప్పు జరిగితే సరిదిద్దుతామని.. అక్రమం జరిగితే
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు,
హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి కలెక్టర్లు,
జిల్లా రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

