- బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
- గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ నిరసన
సంగారెడ్డి, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి) : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉత్తరాఖండ్‌లో ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాఠోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నేరెళ్ల శారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, దుద్దిళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దీపక్ రాఠోర్ మాట్లాడుతూ ఆధునిక యుగంలోనూ దళితుల పట్ల వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు. ఖర్గే దళితుడు కావడం వల్లే ఈ తరహా చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కులం, మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నాలను కాంగ్రెస్ తిప్పికొడుతుందని పేర్కొన్నారు.

