📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కలల కారు.. కష్టాల జోరు..!

కలల కారు.. కష్టాల జోరు..!

తయారీ లోపమంటూ రూ.25 లక్షల ఈవీకి పూర్తి రీఫండ్ డిమాండ్.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వినియోగదారుడి ఫిర్యాదు

కొత్తగా కొనుగోలు చేసిన రూ.25 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారులో తయారీ లోపం ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఓ వినియోగదారు పూర్తి రీఫండ్ కోరుతున్నారు. సమస్యను పలుమార్లు కంపెనీ, డీలర్‌షిప్ దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

కొత్త కారులోనే లోపం గుర్తింపు

హైదరాబాద్‌కు చెందిన నల్లం ఫణి కుమార్ రాజా ఈ ఏడాది ఏప్రిల్‌లో గచ్చిబౌలిలోని షోరూమ్‌లో విన్‌ఫాస్ట్ కంపెనీకి చెందిన వీఎఫ్-7 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. అయితే కారులోని ఏసీ డ్రెయిన్ పైపు అమరికలో లోపం కారణంగా బయటకు వెళ్లాల్సిన నీరు కార్పెట్ కింద పేరుకుపోయి ఫ్లోర్ మొత్తం తడిసిపోయిందని ఆయన ఆరోపించారు. కార్పెట్ శుభ్రం చేసే సమయంలో ఈ సమస్య బయటపడినట్లు తెలిపారు.

సర్వీస్ సెంటర్‌పై అసంతృప్తి

మే 19న కారును సర్వీస్ సెంటర్‌కు అప్పగించినప్పటికీ కార్పెట్‌ను ఆరబెట్టి తిరిగి ఇవ్వడానికే పరిమితమయ్యారని, అసలు తయారీ లోపాన్ని పూర్తిగా సరిచేయలేదని ఫణి కుమార్ రాజా ఆరోపించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను ముగించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

పూర్తి రీఫండ్‌నే డిమాండ్

ఈ అంశంపై కంపెనీకి పలుమార్లు ఈ-మెయిల్స్ పంపినా, డీలర్‌షిప్ వద్ద నిరసన తెలిపినా సంతృప్తికరమైన స్పందన రాలేదని ఆయన తెలిపారు. పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు డీలర్‌షిప్ చెప్పినప్పటికీ, తనకు పరిహారం అవసరం లేదని, తయారీ లోపం ఉన్న వాహనాన్ని వెనక్కి తీసుకుని పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయాలని డిమాండ్ చేశారు.

చట్టపరమైన పోరాటానికి సిద్ధం

వినియోగదారుడిగా తన హక్కుల కోసం అవసరమైతే చట్టపరంగా కూడా పోరాటం కొనసాగిస్తానని ఫణి కుమార్ రాజా స్పష్టం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత, అమ్మకాల అనంతర సేవలు, వినియోగదారుల హక్కులపై చర్చ మొదలైంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న తయారీ లోపానికి సంబంధించిన ఆరోపణలు వినియోగదారు నల్లం ఫణి కుమార్ రాజా చేసినవే. ఈ అంశంపై విన్‌ఫాస్ట్ సంస్థ అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!