రూ.2.5 కోట్లతో భార్యాభర్తలు పరార్.. 20 మందికి పైగా బాధితుల ఫిర్యాదు..
పటాన్చెరు (అమీన్పూర్), ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ చిట్ఫండ్ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో స్థానికుల నుంచి సుమారు రూ.2.5 కోట్లకు పైగా సేకరించిన భార్యాభర్తలు రాత్రికి రాత్రే అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
20 ఏళ్లుగా స్థానికంగా నివాసం
పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు గత 20 ఏళ్లుగా అమీన్పూర్లోని కిష్టారెడ్డిపేట్ బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని ప్రతి నెల చిట్టీలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో నగదు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో సభ్యులకు డబ్బులు సకాలంలో చెల్లించడంతో మరింత మంది చిట్టీల్లో చేరినట్లు సమాచారం.
ఇల్లు విక్రయించి పరార్
ఇటీవల చిట్టీల గడువు ముగియడంతో సభ్యులకు డబ్బులు చెల్లించాల్సిన సమయంలో దంపతులు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం తమ సొంత ఇంటిని సుమారు రూ.1.60 కోట్లకు విక్రయించి, ఇల్లు ఖాళీ చేసి, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైనట్లు తెలిసింది.
రూ.2.5 కోట్లకు పైగా నష్టం
విషయం తెలుసుకున్న బాధితులు ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీగా ఉండటంతో మోసపోయామని గ్రహించారు. తమ కష్టార్జితమైన రూ.2.5 కోట్లకు పైగా నగదు చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 20 మందికి పైగా బాధితులు అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరికొందరు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సాంబశివరావు, శిరీష దంపతుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అమీన్పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

