📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCఎంటమాలజీ విభాగం ఎక్కడ..?గ్రీన్ హిల్స్ వాసుల ఘాటు ప్రశ్న

ఎంటమాలజీ విభాగం ఎక్కడ..?గ్రీన్ హిల్స్ వాసుల ఘాటు ప్రశ్న

ఏడు నెలలుగా ఫాగింగ్ బంద్..!దోమల చెరలో గ్రీన్ హిల్స్

వాహనం ఉంది…ఫాగింగ్ లేదు..!అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

సాయంత్రం బయటకు రావాలంటేనే భయం..పిల్లల ఆటలు, వాకింగ్‌కు బ్రేక్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి):దుందిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీలో దోమల సమస్య తీవ్రరూపం దాల్చినా, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఏడు నెలలుగా ఒక్కసారి కూడా ఫాగింగ్ నిర్వహించకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో “దుందిగల్ సర్కిల్‌లో ఎంటమాలజీ విభాగం నిజంగా పనిచేస్తుందా? లేక కాగితాలకే పరిమితమైందా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఫాగింగ్ వాహనం కూడా సీఎంసీ ద్వారా అందుబాటులోకి వచ్చినప్పటికీ, కాలనీలో మాత్రం ఫాగింగ్ జాడ కనిపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

ఇటీవలి వర్షాలతో దోమల ఉధృతి మరింత పెరిగింది. సాయంత్రం వేళల్లో పిల్లలు బయట సైక్లింగ్ చేయడం, పెద్దలు వాకింగ్‌కు వెళ్లడం పూర్తిగా తగ్గిపోయిందని వాపోతున్నారు. దోమల బెడద కారణంగా ఇంటి తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుందిగల్ సర్కిల్ ఏర్పడినప్పటి నుంచి గ్రీన్ హిల్స్ కాలనీపై ఎంటమాలజీ విభాగం ప్రత్యేక దృష్టి సారించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఫాగింగ్ వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీలో తక్షణమే ఫాగింగ్ నిర్వహించి, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!