అర్బన్ పాలిటిక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లోని ఇందిరా భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ సహ ఇన్‌చార్జ్‌లు రోషిని జైష్వాల్, భవ్య ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో యువజన కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని శ్రేణులు విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జాతీయ యువజన కాంగ్రెస్ చేపట్టిన “అర్బన్ పాలిటిక్స్” కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

