-
ఆలస్యం చేస్తే రేషన్ పంపిణీతో పాటు ఆహార భద్రత కార్డు సేవలపై ప్రభావం.. చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక మార్గదర్శకాలు
హైదరాబాద్, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ నెల 31లోపు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ సూచించింది. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు భవిష్యత్తులో రేషన్ పంపిణీతో పాటు ఆహార భద్రత కార్డు ఆధారంగా అందే సేవలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గడువు పొడిగింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వం అసలైన లబ్ధిదారులను గుర్తించడం, నకిలీ లేదా ద్వంద్వ రేషన్ కార్డులను గుర్తించి తొలగించడం, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను నవీకరించడం లక్ష్యంగా ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది. దీనివల్ల అర్హులైన కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది.
ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు భవిష్యత్తులో రేషన్ పంపిణీలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆహార భద్రత కార్డుతో అనుసంధానమైన సేవలు, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే తర్వాత అదనపు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి రావచ్చని సూచిస్తున్నారు.
ఈ-కేవైసీ కోసం సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లి రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను సమర్పించాలి. ప్రతి సభ్యుడు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర లేదా అవసరమైతే ఐరిస్ ధ్రువీకరణ చేయించుకోవాలి. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది.
చిన్నారులకు ప్రత్యేక నిబంధనలు
ఐదేళ్ల లోపు పిల్లలకు సాధారణంగా బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. వారి ఆధార్ నమోదు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాల ఆధారంగా ఉంటుంది. అయితే ఐదేళ్లు పూర్తైన తర్వాత పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వివరాలను ఆధార్‌లో తప్పనిసరిగా నవీకరించాలి. కుటుంబంలో చిన్నారులు ఉంటే వారి ఆధార్ వివరాలు రేషన్ కార్డులో సరిగా నమోదయ్యాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి వెసులుబాటు
వేలిముద్రలు సరిగా పడని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఐరిస్ ధ్రువీకరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలు నవీకరించుకున్న విద్యార్థులు, చిన్నారులు, అలాగే ఇప్పటి వరకు రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా ఈ-కేవైసీ చేయించుకోని వారు ఈ నెల 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీ, ఇతర సేవల పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కామారెడ్డి జిల్లాకు చెందిన రేషన్ డీలర్ కర్ణాల శ్రీనివాస్ తెలిపాడు

చివరి రోజు వరకు వేచి ఉండకుండా కుటుంబంలోని ప్రతి సభ్యుడి ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రేషన్ పంపిణీతో పాటు ఆహార భద్రత కార్డు ద్వారా అందే సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు.

