-
‘దృశ్యం ‘ సినిమా స్క్రిప్ట్‌లా ప్లాన్ చేసినా.. పోలీసుల ముందు సీన్ రివర్స్
కామారెడ్డి, జూలై 18 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలు, శాస్త్రీయ దర్యాప్తుతో నిందితురాలిని అరెస్టు చేసి, చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల స్వామి, ఆయన భార్య విజయ జూలై 16న వ్యవసాయ పనుల కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి చూడగా బయట గేటు తాళం యథావిధిగా ఉన్నప్పటికీ, ఇంట్లోని బీరువా తాళాలు పగులగొట్టి సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదును అపహరించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భిక్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఎవిడెన్స్‌ను విశ్లేషించి అదే గ్రామానికి చెందిన దొడ్లె లత (27) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు నిందితురాలు ఘటన జరిగిన రోజు తాను కామారెడ్డిలో షాపింగ్‌కు వెళ్లినట్లు బస్సు టికెట్లు, కొనుగోలు బిల్లులు చూపిస్తూ ‘దృశ్యం’ సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా కథ అల్లింది. అయితే సీసీ కెమెరా ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు ఆమె చెప్పిన కథకు భిన్నంగా ఉండటంతో పోలీసుల ముందు ఆ ప్లాన్ నిలవలేదు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితురాలి వద్ద నుంచి 3.34 తులాల బంగారు గుండ్లు, 0.50 తులాల చెవి కమ్మలు, 0.29 తులాల మాటీలు, 0.10 తులాల చిన్న మాటీలు, రెండు బంగారు ముక్కుపుడకలు, మూడు జతల వెండి పట్ట గొలుసులు, వెండి కాళ్ల కడియాలు తదితర చోరీ సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల్లోనే కేసును ఛేదించి చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేసిన భిక్నూర్ సీఐ జె. నరేష్, ఎస్‌ఐ ఎస్. అనిల్, ఏఎస్‌ఐ వెంకటరావు, పీసీలు శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణతో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.

