📄 ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఅమీన్‌పూర్‌లో 34.5 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

అమీన్‌పూర్‌లో 34.5 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

అమీన్‌పూర్ | జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి) :

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.5 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

స్పెషల్ ఆపరేషన్ టీమ్ కుత్బుల్లాపూర్, అమీన్‌పూర్ పోలీసులు సంయుక్తంగా విశ్వసనీయ సమాచారం మేరకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన OD30A7774 నంబర్ గల బొలెరో పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా,చేపల డబ్బాల కింద రెండు మూటల్లో తరలిస్తున్న 34.5 కిలోల ఎండు గంజాయి బయటపడింది.

పోలీసులు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాకు చెందిన సుమిత్ బిపారి (25), బాబుల్ మండల్ (29)లను అదుపులోకి తీసుకున్నారు.మరో నిందితుడు సూక్‌దేవ్ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 34.5 కిలోల ఎండు గంజాయి, బొలెరో పికప్ వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అమీన్‌పూర్ సీఐ నరేష్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ కేసుకు సంబంధించి ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని సీఐ నరేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయికి సంబంధించిన 10 కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విజయ్‌రావు, ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌సుందర్ రెడ్డి, ఎస్‌ఐ రాజేష్, పోలీసు సిబ్బంది దస్తప్ప, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!