హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసి పుస్తక ఆవిష్కరణను అడ్డుకోవాలి: అంబేద్కర్ విజ్ఞాన వేదిక డిమాండ్
పరిగి, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమారా ప్రసాద్ రాస్తున్న పుస్తకాన్ని వెంటనే నిలిపివేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, పీఆర్‌టీయూ పరిగి మండల శాఖ అధ్యక్షుడు – అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం – రాజ్యాంగ హక్కుల కోసం చేసిన కృషికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసం, రచనలు, మహాడ్ చెరువు ఉద్యమం, కుల నిర్మూలన ఉద్యమం, రాజకీయ సంస్థల స్థాపన, ఎన్నికల్లో పోటీ, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షత – పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు వంటి అంశాలు ఆయన చరిత్రలో నమోదయ్యాయని పేర్కొన్నారు. ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ’ వంటి రచనలతో పాటు ఆయన సామాజిక – రాజకీయ కృషికి విస్తృత ఆధారాలు ఉన్నప్పుడు అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొనడం సరికాదన్నారు.
అంబేద్కర్‌పై వివాదాస్పద ప్రచారంపై రాజకీయ పార్టీలు, నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు – వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 18న జరగనున్న పుస్తక ఆవిష్కరణను చట్టపరమైన మార్గాల్లో అడ్డుకోవాలని కోరారు. స్పందన లేకపోతే దళిత, బడుగు బలహీన వర్గాల నాయకులు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యార్థి సంఘాలతో కలిసి ప్రెస్‌క్లబ్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.

