స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రున్ ఆప్ ఇయోర్వెర్త్, ఉత్తర ఐర్లాండ్ నాయకత్వం తమ ప్రాంతాల భవిష్యత్తుపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయం తీసుకునే హక్కును నొక్కిచెప్పే ప్రకటనపై సంతకం చేయనున్నట్లు సమాచారం.
స్వాతంత్ర్యం, అధిక స్వయం ప్రతిపత్తి, ఐర్లాండ్ ఐక్యత వంటి అంశాలు మరోసారి బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారుతున్నాయి.
స్కాట్లాండ్లో స్వాతంత్ర్యంపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఉండొచ్చని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే అనంతరం ఆయన తన వైఖరిని స్పష్టం చేస్తూ తదుపరి సాధారణ ఎన్నికల వరకు మరో స్వాతంత్ర్య రిఫరెండం ప్రశ్నే లేదని తెలిపారు.
ప్రస్తుతం స్కాట్లాండ్లో స్వాతంత్ర్య అనుకూల ఎస్ఎన్పీ ప్రభావం కొనసాగుతోంది. దీనిని స్విన్నీ బ్రిటన్ ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
వేల్స్లో జరిగిన ఎన్నికల అనంతరం ప్లెయిడ్ సిమ్రు అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నేత రున్ ఆప్ ఇయోర్వెర్త్ ఫస్ట్ మినిస్టర్‌గా ఉన్నారు.
వేల్స్‌కు మరిన్ని అధికారాలు, ముఖ్యంగా పన్నులు, ప్రభుత్వ వ్యయం, పోలీసింగ్, రైల్వే నిధులు వంటి అంశాల్లో అధిక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్లెయిడ్ సిమ్రు కోరుతోంది. క్రౌన్ ఎస్టేట్ నుంచి వచ్చే ఆదాయంపై కూడా వేల్స్‌కు అధిక నియంత్రణ ఉండాలని డిమాండ్ చేస్తోంది.
ఉత్తర ఐర్లాండ్ అంశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. డబ్లిన్ పర్యటన సందర్భంగా ఐర్లాండ్ ఐక్యమవడాన్ని తాను కోరుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే ఉత్తర ఐర్లాండ్ భవిష్యత్తుపై నిర్ణయం ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలి. 1998 గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ఉత్తర ఐర్లాండ్ ప్రజల్లో మెజారిటీ యునైటెడ్ కింగ్డమ్ నుంచి విడిపోయి ఐర్లాండ్‌లో చేరాలని కోరుకునే అవకాశం ఉందని భావించినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే నిబంధన ఉంది.
కార్డిఫ్ సమావేశం కేవలం స్వాతంత్ర్య అంశానికే పరిమితం కానున్నట్లు లేదు. ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, యూరప్, అంతర్జాతీయ సహకారం, స్వయం నిర్ణయ హక్కు వంటి అంశాల్లో పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
స్వాతంత్ర్యం సాధించిన సందర్భంలో స్కాట్లాండ్, వేల్స్ యూరోపియన్ యూనియన్‌లో కొత్త సభ్యులుగా చేరాలని, ఉత్తర ఐర్లాండ్ ఐర్లాండ్‌తో ఐక్యమైతే ఈయూ పరిధిలోకి వస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో రాజ్యాంగ మార్పులను కోరుతున్న పార్టీలకు రాజకీయంగా బలం పెరుగుతున్న నేపథ్యంలో కార్డిఫ్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్విన్నీ ఇప్పటికే “మూడు ప్రాంతాలకు తొలిసారిగా స్వాతంత్ర్య అనుకూల ఫస్ట్ మినిస్టర్లు ఉన్నారు” అంటూ బ్రిటన్ ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర్య డిమాండ్లు, ఐర్లాండ్ ఐక్యత, మరిన్ని అధికారాల కోసం ప్రాంతీయ ప్రభుత్వాల ఒత్తిడి ఒకేసారి పెరుగుతున్నాయి. కార్డిఫ్‌లో జరగనున్న సమావేశం బ్రిటన్ సమైక్యతపై తక్షణ నిర్ణయం తీసుకునే వేదిక కాకపోయినా.. భవిష్యత్తులో రాజ్యాంగ మార్పులపై రాజకీయ ఒత్తిడిని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.

