అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అందించిన ప్రెసిడెంట్ డైలీ బ్రీఫ్‌లో 1998 ఆగస్టు 28నాటి నివేదికలో బిన్ లాడెన్ ఉగ్ర నెట్‌వర్క్‌పై కీలక హెచ్చరికలు ఉన్నాయి. “Bin Ladin Terrorist Network Still a Threat” అనే శీర్షికతో ఉన్న ఈ పత్రంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని బిన్ లాడెన్ నెట్వర్క్ అమెరికా క్షిపణి దాడుల తర్వాత కూడా కొనసాగుతోందని సీఐఏ పేర్కొంది.
అతడి కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తోందని, కొన్ని శిక్షణా శిబిరాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, మరికొన్ని శిబిరాలను తరలిస్తున్నట్లు నిఘా సమాచారం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
డీక్లాసిఫై చేసిన పత్రంలోని కనిపించే భాగంలో ఈజిప్ట్, అరేబియా ద్వీపకల్పం—ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా, యెమెన్—తో పాటు భారత్, పాకిస్థాన్, ఉగాండా, బహుశా నైజీరియాలో దాడులు నిర్వహించాలని బిన్ లాడెన్ ఉద్దేశించినట్లు పేర్కొన్నారు.
అయితే పత్రంలో భారత్‌లో ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు, ఎప్పుడు దాడి చేయాలని భావించారు, ఎలాంటి ఆపరేషన్ ప్రణాళిక ఉంది అనే వివరాలు లేవు. సంబంధిత సమాచారంలోని కొంత భాగం ఇప్పటికీ నల్లరంగుతో తొలగించబడి ఉంది.
బిన్ లాడెన్ దాడులకు ఉపయోగించుకోగల నెట్వర్క్ కనీసం 60 దేశాల్లో విస్తరించి ఉన్నట్లు సీఐఏ అంచనా వేసింది. అమెరికా, యూరప్, తూర్పు ఆసియాలో అల్‌ఖైదాకు ఉన్న మౌలిక వ్యవస్థ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోనూ అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో బిన్ లాడెన్ అనుచరులు స్వతంత్రంగా కూడా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించినట్లు పత్రం వెల్లడిస్తోంది.
1998లోనే అమెరికా నిఘా సంస్థలకు బిన్ లాడెన్ నెట్వర్క్ నుంచి పెరుగుతున్న ముప్పుపై వరుస సమాచారం అందింది. అమెరికాపై దాడులకు సంభావ్య లక్ష్యాలపై కూడా నిఘా నివేదికలు వచ్చాయి.
1998 ఆగస్టు 7న కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరగగా, ఆ తర్వాత ఆగస్టు 20న అమెరికా ఆఫ్ఘనిస్థాన్, సూడాన్‌లో క్షిపణి దాడులు చేసింది. ఆ దాడుల అనంతరం కూడా బిన్ లాడెన్ నెట్వర్క్ సజీవంగానే ఉందని ఆగస్టు 28నాటి బ్రీఫ్ పేర్కొంది.
తాజాగా విడుదల చేసిన పత్రాల్లో 1998 నుంచి 2001 సెప్టెంబర్ 12 వరకు బిన్ లాడెన్, అల్‌ఖైదా కార్యకలాపాలపై అమెరికా అధ్యక్షుడికి అందించిన నిఘా బ్రీఫ్‌లు ఉన్నాయి.
వాటిలో 2001 ఆగస్టు 6నాటి “Bin Ladin Determined To Strike in US” అనే అత్యంత కీలకమైన హెచ్చరిక కూడా ఉంది. 9/11 దాడులకు కేవలం కొన్ని వారాల ముందు ఈ హెచ్చరిక అధ్యక్షుడికి అందడం అప్పటి నిఘా వ్యవస్థపై తర్వాత జరిగిన సమీక్షల్లో కీలక అంశంగా మారింది.
9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా సీఐఏ 71 ప్రెసిడెంట్ డైలీ బ్రీఫ్ పత్రాలను డీక్లాసిఫై చేసింది. 1998 నుంచి 2001 సెప్టెంబర్ 12 వరకు ఉగ్రవాద ముప్పుపై అమెరికా అధ్యక్షుడికి అందిన నిఘా అంచనాలను ఈ పత్రాలు వెలుగులోకి తెస్తున్నాయి.
ఈ పత్రాలు అప్పటికే అమెరికా నిఘా సంస్థలకు బిన్ లాడెన్ నెట్వర్క్ విస్తృతి, దాడుల సామర్థ్యం, అమెరికా ప్రయోజనాలపై ఉన్న ముప్పుపై గణనీయమైన సమాచారం ఉన్నట్లు చూపిస్తున్నాయి.
డీక్లాసిఫై చేసిన పత్రంలో భారత్ పేరు దాడులకు ఉద్దేశించిన దేశాల జాబితాలో కనిపిస్తున్నప్పటికీ.. భారత్‌లో నిర్దిష్ట ప్రాంతం, లక్ష్యం లేదా ఖరారైన దాడి ప్రణాళిక ఉన్నట్లు ఈ పత్రం నిర్ధారించదు. కనిపించే సమాచారానికి మించి ఉన్న వివరాలు పత్రంలో నల్లరంగుతో తొలగించబడ్డాయి.

