దళితులను అవమానిస్తే భారీ మూల్యం తప్పదు : నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, సెప్టెంబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నిర్మలా జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులపై దాడికి పాల్పడి తిరిగి తామే బాధితులమన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులు నడిచిన ప్రదేశాన్ని పసుపు, తులసి నీటితో శుద్ధి చేసినట్లు వచ్చిన ఘటనను నిర్మలా జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. దళితులను అవమానించే రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, జార్జ్, కిరణ్‌గౌడ్, సంతోష్, శ్రీకాంత్, రామ్‌చందర్ నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

