📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెల్లకోటు మాటున నకిలీ వైద్యం!

తెల్లకోటు మాటున నకిలీ వైద్యం!

టెన్త్‌.. ఇంటర్‌.. బీకామ్‌.. కానీ క్లినిక్‌లో ‘డాక్టర్లు’.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం
కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):
చదివింది టెన్త్‌, ఇంటర్‌, బీకామ్‌.. చేతిలో స్టెతస్కోప్‌.. క్లినిక్‌లో బెడ్లు.. రోగులకు సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తూ వైద్యులుగా చెలామణి అవుతున్న నకిలీ వైద్యుల గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్న 10 మంది నకిలీ వైద్యులను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుత్బుల్లాపూర్‌ జోన్‌ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ వైద్యులపై సైబరాబాద్‌ ఎస్‌ఓటీ బృందాలు, వైద్య శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక నిఘా చేపట్టినట్లు తెలిపారు.

ఏకకాలంలో 10 క్లినిక్‌లపై దాడులు

మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నకిలీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఏకకాలంలో 10 క్లినిక్‌లపై మెరుపు దాడులు నిర్వహించారు. పేట్‌బషీరాబాద్‌, మేడ్చల్‌, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్‌చెరు, ఆర్సీపురం తదితర ప్రాంతాల్లో ఈ క్లినిక్‌లు కొనసాగుతున్నట్లు గుర్తించారు.

చిన్నారులకు కూడా చికిత్స..!

సరైన వైద్య అర్హతలు, మెడికల్‌ పరిజ్ఞానం లేకుండానే క్లినిక్‌లలో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేకుండానే రోగులకు సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం, మందులు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు.

క్లినిక్‌లో ‘డాక్టర్‌’ అవతారం

వైద్య విద్యార్హతలు లేకపోయినా క్లినిక్‌లు ఏర్పాటు చేసి రోగులను పరీక్షించడం, మందులు ఇవ్వడం, సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం వంటి వైద్య ప్రక్రియలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వీరి వద్ద చికిత్స పొందుతున్న రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎక్స్‌పైరీ మందులు.. సిరంజీలు సీజ్‌

దాడుల సందర్భంగా క్లినిక్‌ల నుంచి బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు, గ్లూకోజ్‌ పరీక్షా పరికరాలు, సిరంజీలు, ఇతర వైద్య సామగ్రితో పాటు ఎక్స్‌పైరీ అయిన మందులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాణాలకు ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నకిలీ వైద్యుల వద్ద చికిత్స తీసుకోవడం వల్ల రోగుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సరైన అర్హతలు, గుర్తింపు పొందిన వైద్య సర్టిఫికెట్లు కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు.

నకిలీ క్లినిక్‌లపై నిఘా

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ వైద్యులు, అనుమతులు లేని క్లినిక్‌లపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కుత్బుల్లాపూర్‌ జోన్‌ డీసీపీ కోటి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెల్లకోటు చూసి నమ్మొద్దు..!

క్లినిక్‌, స్టెతస్కోప్‌, బెడ్లు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ వైద్యులు కాదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్‌ వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే చికిత్స తీసుకోవాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!