📄 ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాఖీ రద్దీకి టీజీఎస్‌ఆర్టీసీ రెడీ.. 5 వేల ప్రత్యేక బస్సులు !

రాఖీ రద్దీకి టీజీఎస్‌ఆర్టీసీ రెడీ.. 5 వేల ప్రత్యేక బస్సులు !

ఈరోజు నుంచి 31 వరకు ప్రత్యేక సర్వీసులు.. గతేడాది కంటే 240 బస్సులు అదనం

తిరుగు ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి.. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం యథావిధి

హైదరాబాద్, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి):

రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈరోజు నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి రద్దీకి అనుగుణంగా మరో 240 బస్సులను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రత్యేక బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ, తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రద్దీ పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చోట అదనపు బస్సులను వెంటనే మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

ఆదివారం నుంచి తిరుగు రద్దీ

ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి 31 సోమవారం వరకు ప్రయాణికుల తిరుగు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో ప్రధాన బస్‌స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి అక్కడికక్కడే అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగింపు

రాఖీ పౌర్ణమి రద్దీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బస్‌స్టేషన్లలో సౌకర్యాలపై నిఘా

పండుగ రద్దీ నేపథ్యంలో బస్‌స్టేషన్లలో మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రద్దీ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పండుగ సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాఖీ పౌర్ణమి ప్రత్యేక ఏర్పాట్లు:
• నేటి నుంచి 31 వరకు 5,000 ప్రత్యేక బస్సులు
• గతేడాదితో పోలిస్తే 240 అదనపు బస్సులు
• ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు రద్దీపై ప్రత్యేక దృష్టి
• రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు
• ప్రధాన బస్‌స్టేషన్లలో అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
• మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
• మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధి
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!