బుకింగ్ విధానంపై రైతుల ఆవేదన
కాట్రియాల్, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్): కొత్తగా వచ్చిన యూరియా బుకింగ్ యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాట్రియాల్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేట మండలం కాట్రియాల్ రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో యూరియా కొరత, బుకింగ్ విధానంపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సకాలంలో ఎరువులు అందడం లేదని ఆవేదన
పంటలు వేసి నెల రోజులు గడుస్తున్నా అవసరమైన సమయంలో యూరియా అందుబాటులోకి రావడం లేదని రైతులు వాపోయారు. యూరియా కోసం బుకింగ్ చేసేందుకు యాప్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సకాలంలో ఎరువులు అందకపోతే పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా ధరపైనా ప్రశ్నలు
యూరియా ధరల్లోనూ తేడా ఉందని రైతులు పేర్కొన్నారు. ఇతర మండలాల్లో యూరియా బస్తా రూ.290కే విక్రయిస్తుండగా, కాట్రియాల్ క్లస్టర్లో రూ.310 చొప్పున విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించి, సకాలంలో యూరియా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

