విద్యార్థులు – అధ్యాపకుల ఆందోళనలపై అధ్యయనం
డిప్లొమా, ఉద్యోగాలు, ఈసెట్, సర్వీస్ అంశాలపై స్పష్టతకు కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 24 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ఆధునీకరణ – విద్యార్థులు, అధ్యాపకులు,
ఉద్యోగుల విద్యా – కెరీర్ ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ జీఓఆర్టీ నంబర్ 1239ను జారీ చేసింది.
30 రోజుల్లో అన్ని వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి
సిఫారసులు చేయాలని కమిటీకి ఆదేశించింది.
ఎవరు కమిటీలో?
ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
తెలంగాణ శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం,
ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
శ్రీ నవీన్ మిట్టల్, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్య
కమిషనర్ సభ్యులుగా ఉంటారు. సాంకేతిక విద్య కమిషనర్ సభ్య కన్వీనర్‌గా
వ్యవహరిస్తారు.
ఎందుకు కమిటీ?
పాలిటెక్నిక్ విద్యను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించడం,
కొత్త కోర్సులు – ఆధునిక ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు – అప్రెంటిస్‌షిప్
అవకాశాలను పెంచడం, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం
ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా జీఓలో పేర్కొంది.
అయితే గత జూన్ 16న జారీ చేసిన జీఓ 97తో పాలిటెక్నిక్ విద్యను కొత్త
స్కిల్లింగ్ వ్యవస్థలోకి తీసుకురావడంపై విద్యార్థులు – అధ్యాపకులు పలు
అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డిప్లొమా గుర్తింపు, ఈసెట్ ద్వారా బీటెక్‌లో
లేటరల్ ఎంట్రీ, ఫీజులు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, పాలిటెక్నిక్
వ్యవస్థ భవిష్యత్తు వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
30 రోజుల్లో నివేదిక
కమిటీ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు – ఇతర భాగస్వాములతో విస్తృతంగా
చర్చలు నిర్వహించాలి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన అన్ని అంశాలను
సమగ్రంగా అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నిర్దిష్ట
సిఫారసులు చేయాలి. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం
తదుపరి చర్యలు తీసుకోనుంది.
డిప్లొమా – ఈసెట్‌పై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత
పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేసే
ప్రక్రియపై ప్రభుత్వం గతంలో స్పష్టత ఇచ్చింది. మూడేళ్ల ఏఐసీటీఈ
గుర్తింపు పొందిన డిప్లొమా కోర్సులు కొనసాగుతాయని, ఈసెట్ ద్వారా
బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ అవకాశం కొనసాగుతుందని ప్రభుత్వం
తెలిపింది.
ఫీజులు – స్కాలర్షిప్లు – ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ విద్యార్థులకు
ఇబ్బంది ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఉద్యోగుల ప్రయోజనాలపైనా పరిశీలన
ఉద్యోగుల విషయంలో ప్రస్తుత క్యాడర్, పోస్టులు కొనసాగుతాయని ప్రభుత్వం
స్పష్టం చేసింది. సర్వీస్ నిబంధనలు – పదోన్నతులు – జీతభత్యాల్లో మార్పు
ఉండదని తెలిపింది. అయితే తాజా కమిటీ ఈ అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించి
ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది.
విద్యార్థుల ఆందోళనల మధ్య కీలక నిర్ణయం
ప్రభుత్వ వివరణలతో విద్యార్థులు పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో జీఓ 97ను
ఉపసంహరించుకోవాలని డిమాండ్లు వినిపించాయి. పాలిటెక్నిక్ విద్యను
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై ఫీజులు,
పీపీపీ విధానం, విద్యా ప్రమాణాలు – భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై
విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రభుత్వానికి అసలు పరీక్ష
పాలిటెక్నిక్ విద్యను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం – విద్యార్థులకు
మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు.. డిప్లొమా విద్యా వ్యవస్థ,
విద్యార్థుల హక్కులు – ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం మరోవైపు ఉన్నాయి.
ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే కొత్త కమిటీకి ప్రధాన సవాలుగా
మారింది.
ఇప్పటికే ప్రభుత్వం పాలిటెక్నిక్‌లలో కొత్త కోర్సులు – మౌలిక వసతుల
అభివృద్ధికి పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. విద్యార్థులు
నైపుణ్యాలతో బయటకు వచ్చి ఉద్యోగాలు పొందేలా సిలబస్ – బోధనలో మార్పులు
తీసుకురావడంపై కూడా దృష్టి పెట్టింది.
జీఓ 97 అమలు విధానంలో మార్పులా? పాలిటెక్నిక్ విద్యకు కొత్త రూపమా?
డిప్లొమా – ఈసెట్ – ఉద్యోగుల హక్కులపై మరింత స్పష్టతా?
కమిటీ సిఫారసులపై ఇప్పుడు విద్యార్థులు – అధ్యాపకుల దృష్టి.
కీలకం:
తాజా హై లెవల్ కమిటీ ఏర్పాటు జీఓ 97ను వెంటనే రద్దు చేసినట్లు కాదు.
విద్యార్థులు – అధ్యాపకులు – ఉద్యోగుల ఆందోళనలను పరిశీలించి, పాలిటెక్నిక్
విద్య భవిష్యత్తుపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన
ప్రక్రియగా దీనిని చూడాల్సి ఉంటుంది.

