మున్సిపల్ సిబ్బంది తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్ రవి ఆగ్రహం
నిబంధనల ప్రకారం సమాచారం ఇచ్చి పనులు చేపట్టాలి
రామాయంపేట, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
రామాయంపేట మున్సిపాలిటీ 3వ వార్డులో తన షాపు ముందు ఉన్న సీసీ నిర్మాణాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తొలగించడంపై అధికార పార్టీ కౌన్సిలర్ గుగులోత్ రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా చర్యలు చేపట్టడం బాధాకరమన్నారు.
సీసీ నిర్మాణాన్ని తొలగించే క్రమంలో జేసీబీ తాకడంతో షాపులోని సుమారు రూ.1.50 లక్షల విలువైన ఆయిల్ చేంజ్ మిషన్ దెబ్బతిన్నట్లు కౌన్సిలర్ తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉన్నట్లయితే ముందుగా తనకు సమాచారం ఇచ్చి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరించేవాడినన్నారు. ఉన్నట్టుండి యంత్రాలతో వచ్చి నిర్మాణాన్ని తొలగించడం వల్ల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా?
తొలగింపు చర్యలపై సిబ్బందిని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేశామని చెబుతున్నారని, సంబంధిత ప్రజాప్రతినిధులను అడిగితే సిబ్బందిని చూపుతున్నారని రవి అన్నారు. ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టి, అనంతరం బాధ్యతను ఒకరిపై మరొకరు నెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలతో పాటు కౌన్సిలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ పనులు చేపట్టాలని కోరారు.
అభివృద్ధి పేరుతో ఏకపక్ష నిర్ణయాలు వద్దు
రహదారి విస్తరణ, డ్రైనేజీ లేదా ఇతర అభివృద్ధి పనులు అవసరమైతే నిబంధనల ప్రకారం ముందస్తు సమాచారం ఇచ్చి చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలని, ప్రజలకు వాస్తవంగా ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మున్సిపల్ అధికారుల తీరుపై చర్చిస్తామని రవి తెలిపారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడుతూ, పారదర్శకంగా పనులు చేపట్టాలని కోరారు. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల తరఫున తదుపరి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు

