ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై ముందస్తు జాగ్రత్తలు
తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలి: వ్యవసాయ అధికారులు
రామాయంపేట, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో హెచ్చుతగ్గులు, వర్షాల ఆలస్యం, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మంగళవారం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, సీపీఓ సురేష్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి జాబేరుల్లా మాట్లాడుతూ నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అధిక నీరు అవసరమయ్యే పంటలతో పాటు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు.
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం
తక్కువ నీటితో తక్కువ కాలంలో చేతికొచ్చే కందులు, మినుములు, పెసలు, వేరుశనగ, నువ్వులు, జొన్న, సజ్జ, రాగి తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే స్వల్పకాలిక విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. తద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంట నష్టాలను కొంతవరకు నివారించవచ్చన్నారు.
నీటి పొదుపే ప్రధాన లక్ష్యం
అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. నేలలో తేమను కాపాడేందుకు అంతర కృషి, మల్చింగ్ వంటి పద్ధతులను పాటించాలన్నారు. విత్తనాలు విత్తడం, ఎరువుల వినియోగం, పంటల ఎంపిక తదితర నిర్ణయాలను వ్యవసాయ శాఖ సూచనలు, అధికారిక వాతావరణ సమాచారం ఆధారంగా తీసుకోవాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులపై రైతులు ఆందోళన చెందకుండా నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి పంట నష్టాలను తగ్గించుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

