- పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకైన పథకాలను కొనసాగించాలి
- సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన…..
సంగారెడ్డి, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి) : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తదితరులు అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. పెండింగ్ దరఖాస్తుదారులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు ఎందుకు వినిపించలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించి, పెండింగ్ లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని డిమాండ్ చేశారు. పథకాల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు.

