హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమ తరలింపు.. లారీ, ఇద్దరు డ్రైవర్ల అదుపులోకి
పిట్లం, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పిట్లం పోలీసులు పట్టుకున్నారు. లారీలో 632 బస్తాల్లో తరలిస్తున్న 30,690 కిలోల (30.69 టన్నుల) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానంతో లారీ తనిఖీ
పోలీసుల వివరాల ప్రకారం.. పీడీఎస్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పిట్లం ఏఎస్సై జయ విజయ సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం పిట్లం ఎక్స్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళ్తున్న గుజరాత్ రిజిస్ట్రేషన్ లారీ (GJ-25-U-7022)ను అనుమానంతో ఆపి తనిఖీ చేయగా బియ్యం బస్తాలు బయటపడ్డాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రూ.90 వేల పారితోషికం ఆఫర్
విచారణలో పట్టుబడిన వారిని గుజరాత్‌లోని సూరత్ జిల్లా బర్డోలికి చెందిన దేవరాజ్ పర్బత్ కరమ్తా (52), మహారాష్ట్రలోని ధులే జిల్లా సక్రి మండలం గంగాపూర్‌కు చెందిన షరద్ ఆబా బచ్కర్ (38)గా గుర్తించారు. పోలీసుల రికార్డు ప్రకారం.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ సమీపంలో పీడీఎస్ బియ్యాన్ని లారీలో లోడ్ చేసినట్లు దేవరాజ్ తెలిపాడు. ఇబ్రహీం అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు బియ్యం తరలిస్తే రూ.90 వేల పారితోషికం ఇస్తానని చెప్పడంతో అంగీకరించినట్లు పేర్కొన్నాడు.
ఆగస్టు 13 రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బియ్యాన్ని లారీలో లోడ్ చేసి గుజరాత్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అలసట కారణంగా ఇద్దరు డ్రైవర్లు వంతులవారీగా లారీ నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
632 బస్తాల్లో 30,690 కిలోలు
లారీలో మొత్తం 632 బస్తాల్లో 30,690 కిలోల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు. షరద్ ఆబా బచ్కర్ దేవరాజ్ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.15 వేల జీతం తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. బియ్యం తరలింపునకు అదనంగా డబ్బు ఇస్తామని చెప్పడంతో దేవరాజ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చి బియ్యం లోడ్ చేసినట్లు అతడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సుమోటోగా కేసు నమోదు
ఈ ఘటనపై పిట్లం పోలీసులు సుమోటోగా క్రైం నంబర్ 148/2026 కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4), అత్యవసర వస్తువుల చట్టం సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, సరఫరా వ్యవస్థపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, ఏఎస్సై జయ విజయతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ అభినందించారు.

