భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో సహచర కూలీ హత్య.. పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ
మనోహరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు బిట్టు కుమార్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లాకల్ గ్రామంలో బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి శ్రీరామ్ పాండరీ నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉండేవాడు. అదే ఇంటిలో మేస్త్రీగా పనిచేస్తున్న ప్రమోద్ పాశ్వాన్ (43) కూడా నివాసం ఉండేవాడు.
ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉంటున్నాడని బిట్టు కుమార్ అనుమానించాడు. ఈ విషయంపై గతంలో రెండు మూడు సార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బిట్టు కుమార్ ఆగ్రహానికి గురయ్యాడు.
2024 నవంబర్ 16న రాత్రి సుమారు 9 గంటలకు బిట్టు కుమార్ సరుకులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్యకు సరుకులు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో ప్రమోద్ పాశ్వాన్ ఆమె నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ ప్రమోద్ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రమోద్ బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో మరింత ఆగ్రహించిన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బిట్టు కుమార్ అక్కడి నుంచి పరారై పటాన్‌చెరువుకు వెళ్లాడు.
ఘటనపై మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కీలక సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించారు. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులుగా ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్‌రెడ్డి కీలకంగా సహకరించారు.
నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, పూర్తి స్థాయి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

