📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డ్రగ్‌ టెస్ట్‌లో పైలట్‌కు పాజిటివ్‌.. కఠిన నిబంధనలపై డీజీసీఏ దృష్టి !

డ్రగ్‌ టెస్ట్‌లో పైలట్‌కు పాజిటివ్‌.. కఠిన నిబంధనలపై డీజీసీఏ దృష్టి !

రెండోసారి పాజిటివ్‌.. ప్రస్తుత నిబంధనలను సమీక్షిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానానికి చెందిన పైలట్‌ డ్రగ్‌ పరీక్షలో రెండోసారి పాజిటివ్‌గా తేలిన ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. పైలట్‌-ఇన్‌-కమాండ్‌కు నిర్వహించిన నిర్ధారణ డ్రగ్‌ పరీక్షలోనూ పాజిటివ్‌ ఫలితం రావడంతో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌ మోహన్‌ నాయుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత నిబంధనలను సమీక్షించి, అవసరమైతే మరింత కఠినంగా మారుస్తామని చెప్పారు.

ఆగస్టు 4న ఫుకెట్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా AI2379 విమానం ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడగా.. విమానం అనంతరం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. మొత్తం 17 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.

రెండుసార్లు పాజిటివ్‌

విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయిన తర్వాత పైలట్‌-ఇన్‌-కమాండ్‌కు నిర్వహించిన తొలి సైకోఆక్టివ్‌ సబ్‌స్టెన్స్‌ స్క్రీనింగ్‌ పరీక్షలో ఫలితం ‘నాన్‌-నెగెటివ్‌’గా వచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం నిర్ధారణ పరీక్ష నిర్వహించగా అది కూడా పాజిటివ్‌గా తేలింది.

కఠిన పరీక్షలపై డీజీసీఏ

పైలట్లలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు మరింత కఠినమైన డ్రగ్‌ పరీక్షల నిబంధనలను రూపొందించేందుకు డీజీసీఏ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం స్క్రీనింగ్‌ పరీక్షలో నాన్‌-నెగెటివ్‌ వచ్చిన సిబ్బందిని వెంటనే భద్రతాపరమైన విధుల నుంచి తప్పిస్తారు. నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌ వస్తే డీ-అడిక్షన్‌, పునరావాసానికి పంపిస్తారు.

పునరావాసం అనంతరం మరో డ్రగ్‌ పరీక్షలో నెగెటివ్‌ వస్తే తిరిగి విమాన విధుల్లోకి అనుమతిస్తారు. అయితే తిరిగి విధుల్లో చేరిన తర్వాత మరోసారి పాజిటివ్‌గా తేలితే మూడేళ్లపాటు పైలట్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. మూడోసారి పాజిటివ్‌గా తేలితే లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.

AI2379 ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు

ఆగస్టు 4న జరిగిన AI2379 ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు చేపట్టింది. విమానం, దాని వ్యవస్థలు, ఫ్లైట్‌ డేటా, ఆపరేషనల్‌, మెయింటెనెన్స్‌ రికార్డులు, వైద్య సమాచారం, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలిస్తోంది.

ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను సూచించడమే దర్యాప్తు లక్ష్యమని పౌర విమానయాన శాఖ తెలిపింది. దర్యాప్తు పూర్తికాకముందే విడివిడిగా లభించిన సమాచారంతో తుది నిర్ణయాలకు రావద్దని కూడా హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!