భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ.. మూడు దశాబ్దాల అనుభవం..
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): ప్రముఖ సాగర శాస్త్రవేత్త డా. శ్రీనివాస కుమార్ తుమ్మల కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వహించిన డా. ఎన్. కలైసెల్వి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో డా. ఎం. రవిచంద్రన్ పూర్తి స్థాయిలో కొనసాగారు.
రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ ఆధారిత సాగర పరిశోధన, తీర ప్రాంత విపత్తుల నివారణ, విపత్తు నిర్వహణ రంగాల్లో డా. తుమ్మలకు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 2020 ఆగస్టు నుంచి హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన హయాంలో మత్స్యకారులకు చేపల లభ్యత ప్రాంతాలపై సూచనలు, పగడపు దిబ్బల మార్పుల హెచ్చరికలు, బహుళ విపత్తుల ముప్పు అంచనా సేవలు మరింత అభివృద్ధి చెందాయి.
2004 హిందూ మహాసముద్ర సునామీ అనంతరం భారత్‌లో సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటులో డా. తుమ్మల కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్యవస్థ ఏర్పాటులో భాగస్వామ్యమయ్యారు. అనంతరం INCOIS అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సునామీ సేవా కేంద్రంగా ఎదిగింది.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో యునెస్కో అంతర్ ప్రభుత్వ సాగర శాస్త్ర కమిషన్ పరిధిలోని ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్ సెక్రటేరియట్‌కు కూడా ఆయన నేతృత్వం వహించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 28 సభ్య దేశాలకు సంబంధించిన సునామీ హెచ్చరిక వ్యవస్థల సమన్వయంలో కీలకంగా వ్యవహరించారు.
శాస్త్రరంగంలో చేసిన కృషికి 2008లో ఇండియన్ నేషనల్ జియోస్పేషియల్ అవార్డు, 2010లో నేషనల్ జియోసైన్స్ అవార్డులను అందుకున్నారు. అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికల్లో 100కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
కొత్త బాధ్యతల్లో దేశంలోని సాగర, వాతావరణ పరిశీలనా వ్యవస్థల బలోపేతం, వాతావరణ నమూనాల అభివృద్ధి, డీప్ ఓషన్ మిషన్, సముద్ర పరిశోధన, బహుళ విపత్తుల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై ఆయన దృష్టి సారించనున్నారు.

