వాట్సాప్ ఉద్యోగ ఆఫర్‌తో రిటైర్డ్ ఉద్యోగికి రూ.96 లక్షలు టోకరా..
హైదరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): నగరంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. 2025 జనవరి నుంచి 2026 జూలై 31 వరకు 60 ఏళ్లు పైబడిన 403 మంది రూ.102.02 కోట్లు కోల్పోయినట్లు హైదరాబాద్ సిటీ పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫేక్ ట్రేడింగ్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, పెట్టుబడుల పేరుతో నేరగాళ్లు వృద్ధులను బురిడీ కొట్టిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌కు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సందేశం వచ్చింది. తొలుత చిన్న పనులు అప్పగించి కొంత నగదు చెల్లించిన సైబర్ నేరగాళ్లు ఆయన నమ్మకాన్ని పొందారు. అనంతరం టెలిగ్రామ్ గ్రూపులో చేర్చి ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టించారు. నకిలీ యాప్‌లో భారీ లాభాలు చూపించి మరింత డబ్బు పెట్టించారు. నగదు ఉపసంహరణకు అదనపు ఛార్జీలు చెల్లించాలని చెప్పడంతో చివరకు రూ.96 లక్షలు కోల్పోయారు.
70 ఏళ్ల రిటైర్డ్ గెజిటెడ్ అధికారికి ముంబై పోలీసులమంటూ వాట్సాప్ వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారని బెదిరించారు. అరెస్టు చేస్తామని భయపెట్టి, నకిలీ పత్రాలు చూపించి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామనే పేరుతో రూ.85 లక్షలను ఆర్టీజీఎస్ చేయించారు.
వృద్ధులను దెబ్బతీసిన మోసాల్లో ట్రేడింగ్ ఫ్రాడ్ మొదటి స్థానంలో ఉంది. 113 కేసుల్లో బాధితులు రూ.55.88 కోట్లకు పైగా నష్టపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 69 కేసుల్లో రూ.31.93 కోట్లు పోయాయి. ఓటీపీ మోసాలు అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా.. రూ.4.94 కోట్ల నష్టం జరిగింది.
పెట్టుబడి మోసాల్లో 22 కేసులకు రూ.2.79 కోట్లు, డేటింగ్, హనీప్యాప్ మోసాల్లో ఏడు కేసులకు రూ.70.11 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.
డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం చట్టంలో లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ లేదా వీడియో కాల్లో బెదిరించి డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేశారు. అనుమానాస్పద వాట్సాప్, టెలిగ్రామ్ పెట్టుబడి ఆఫర్లకు దూరంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థలు సెబీ వద్ద నమోదై ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. తొలినాళ్లలో ఫిర్యాదు చేస్తే లావాదేవీలను నిలిపివేసి డబ్బును తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. వృద్ధుల అనుమానాస్పద లావాదేవీలపై కుటుంబ సభ్యులు, బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

