నందిపేటలో కారు దగ్ధం.. నలుగురికి గాయాలు..
నందిపేట, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి):
రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారును ఆపకుండా వెళ్లిపోతుండగా కొద్దిసేపటికే మంటలు అంటుకుని కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నందిపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఎస్సై వినయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండలం సీహెచ్.కొండూర్‌కు చెందిన అవుసలి గంగాధర్ కారులో మాక్లూర్ మండలం డీకంపల్లికి వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తున్నాడు. విజయనగరం గ్రామ సమీపంలో రాంగ్‌రూట్‌లో వచ్చి ఆర్మూర్ వైపు వెళ్తున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో నందిపేటకు చెందిన, ముప్కాల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహ్మద్ అక్తర్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత గంగాధర్ కారును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నందిపేట శివారులోని సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గంగాధర్ కారు నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.

