📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఓవైసీ క్యాంపస్‌ కేసులో అధికారులకు హైకోర్టు ధిక్కరణ నోటీసులు...

ఓవైసీ క్యాంపస్‌ కేసులో అధికారులకు హైకోర్టు ధిక్కరణ నోటీసులు…

జయేశ్‌ రంజన్, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సహా పలువురు అధికారులకు నోటీసులు

హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): బండ్లగూడలోని బారిస్టర్‌ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌కు సంబంధించిన సల్కం చెరువు ఆక్రమణల కేసులో తెలంగాణ హైకోర్టు పలువురు ఉన్నతాధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టింది.

సల్కం చెరువులోని ఆక్రమణలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు వాటిని అమలు చేయలేదంటూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టారు.

సర్వే నంబర్‌ 62పై పిటిషనర్‌ వాదన

సర్వే నంబర్‌ 62ను ప్రభుత్వ చెరువు భూమిగా గతంలోనే కోర్టులు తేల్చాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 1997, 2010, 2015లో వెలువడిన తీర్పుల్లోనూ ఈ భూమి చెరువులో భాగమని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ తాజాగా సర్వే నిర్వహించి కొత్తగా ఎన్‌టీఎల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని ఆరోపించారు.

ఏప్రిల్‌ 9న సంబంధిత అధికారులు కోర్టుకు ఇచ్చిన సమాచారంలో తప్పులు ఉన్నాయని, గత తీర్పులకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్‌ వాదించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమర్పించిన వివరాలను కూడా కోర్టు పరిశీలించింది.

నిషేధిత జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్లా?

నిర్మాణాలు జరిగిన భూమి ఇప్పటికీ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశాన్ని కూడా పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన పత్రాలను సమర్పిస్తామని, రిజిస్ట్రేషన్లపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆరోపిస్తూ ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. జిల్లా కలెక్టర్‌ను కూడా కేసులో ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 11న తదుపరి విచారణ

వాదనలు విన్న హైకోర్టు సంబంధిత ఐఏఎస్‌ అధికారులు, ఇతర అధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!