87 శాతం శాశ్వత వైకల్యం.. రూ.38 లక్షల రుణంతో ట్రావెల్ బ్యాన్.. ప్రభుత్వ జోక్యం కోసం కుటుంబం వేడుకోలు…
హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): ఒకప్పుడు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సేవలందించిన తెలంగాణకు చెందిన నర్స్.. ఇప్పుడు తన ప్రాణాల కోసం, స్వదేశానికి చేరుకునేందుకు ప్రభుత్వ సాయాన్ని ఎదురుచూస్తోంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉర్తి కమ్మపాడు గ్రామానికి చెందిన గుగులోత్ సునీత సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదానికి గురై 87 శాతం శాశ్వత వైకల్యానికి గురికాగా, రూ.38 లక్షల బ్యాంకు రుణ వివాదం కారణంగా విధించిన ట్రావెల్ బ్యాన్‌తో స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయింది.
సునీత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 2024 సెప్టెంబర్ 7న సౌదీలోని కింగ్ అబ్దుల్లా ఆసుపత్రిలో ఐసీయూ నర్స్ స్పెషలిస్ట్‌గా చేరింది. 2025 ఏప్రిల్ 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు, వెన్నెముక, తలకు తీవ్ర గాయాలు కావడంతో పలుమార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. శరీరంలో మెటల్ ప్లేట్లు అమర్చగా, సౌదీ వైద్య బోర్డు ఆమెకు 87 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించింది. దీంతో ఆమె ఉద్యోగం కూడా కోల్పోయింది.
ప్రమాదానికి ముందు కుటుంబ అవసరాల కోసం అల్ రాజ్హీ బ్యాంకు నుంచి 1.48 లక్షల సౌదీ రియాల్స్ (సుమారు రూ.38 లక్షలు) రుణం తీసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వైద్య ధ్రువపత్రాలు బ్యాంకుకు సమర్పించినప్పటికీ రుణ సమస్య పరిష్కారం కాకపోవడంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం భారత్‌కు రావాల్సిన పరిస్థితి ఉన్నా స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కావడం లేదు.
సునీత కేవలం కుటుంబానికి సంపాదించే వ్యక్తి మాత్రమే కాదు.. ఆమెనే కుటుంబానికి అండగా నిలిచింది. తల్లి గుండె శస్త్రచికిత్స, తండ్రి మెదడు శస్త్రచికిత్స, ముగ్గురు సోదరీమణుల చదువులు, వివాహాలు, ప్రసూతి ఖర్చులు, 2011లో మరణించిన సోదరుడి ఇద్దరు పిల్లల బాధ్యతలను కూడా ఆమెనే భరించింది. ప్రస్తుతం నవంబర్ 2025 నుంచి జీతం నిలిచిపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో జూలై 31న ‘సీఎం ప్రవాసి ప్రజావాణి’లో సునీత తల్లి గుగులోత్ పరేంగి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి. చిన్నారెడ్డి ఈ వినతిని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రికి పంపిస్తూ తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడు మంధా భీమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశం చేయగా, హెల్ప్‌డెస్క్ లైజన్ అధికారి భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి వినతిపత్రం సిద్ధం చేయడంలో సహకరించారు.
సునీతను అత్యవసరంగా తెలంగాణకు తీసుకురావడం, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా ఆర్థిక, న్యాయ సహాయం అందించడం, బ్యాంకు రుణ వివాదాన్ని పరిష్కరించడం, ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయించడం, భారత్‌లో మెరుగైన వైద్యం, పునరావాసం కల్పించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విదేశాల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల పునరావాసానికి గతంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో, సునీత విషయంలో కూడా మానవతా దృక్పథంతో త్వరితగతిన చర్యలు తీసుకుని ఆమెను స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులతో పాటు పలువురు కోరుతున్నారు.

