📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హైడ్రా ముద్రతో.. నకిలీ బాగోతం..!

హైడ్రా ముద్రతో.. నకిలీ బాగోతం..!

ఫోర్జరీ ఫైర్ ఎన్‌వోసీలతో అనుమతులు.. 7 జూనియర్ కళాశాలలపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుమతుల ప్రక్రియలో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. హైడ్రా (HYDRAA) పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (Fire NOCs) సృష్టించి, వాటి ఆధారంగా అనుమతులు పొందిన వ్యవహారంలో ఏడు జూనియర్ కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైడ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

హైడ్రా అధికారులు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలికి సమర్పించిన మొత్తం 76 ఫైర్ ఎన్‌వోసీలను పరిశీలించగా, వాటిలో ఏడు ధ్రువపత్రాలు నకిలీవని నిర్ధారించారు. హైడ్రా లేదా జీహెచ్‌ఎంసీ జారీ చేసినట్లుగా ఫోర్జరీ చేసి, విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్లు గుర్తించారు. ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా కళాశాలలు అనుబంధం, నిర్వహణ అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వాటియా ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, నకిలీ ప్రభుత్వ పత్రాల తయారీ, మోసం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను రూపొందించిన వారు, వాటిని వినియోగించిన వారు, ఈ వ్యవహారంలో సహకరించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదైన కళాశాలలు

హైందవి జూనియర్ కాలేజీ – బర్కత్‌పుర

రెజోనెన్స్ జూనియర్ కాలేజీ – ఎస్.ఆర్.నగర్

ప్రియాంక జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ – మెహదీపట్నం

మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ – విద్యానగర్

శ్రీ చంద్ర జూనియర్ కాలేజీ – చాంద్రాయణగుట్ట

న్యూ ఎరా జూనియర్ కాలేజీ – చిక్కడపల్లి

షహీన్ జూనియర్ కాలేజీ – శివరాంపల్లి

అదేవిధంగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని వసిష్ట జూనియర్ కాలేజీ సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీ కూడా నకిలీగా గుర్తించినట్లు హైడ్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సమర్పించిన ఇతర ఫైర్ ఎన్‌వోసీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో విద్యాసంస్థల అనుమతుల ప్రక్రియలో నకిలీ ధ్రువపత్రాల వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖల పేర్లతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి అనుమతులు పొందే ప్రయత్నాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

© నవజ్యోతి తెలుగు డైలీ

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!