జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భిక్కనూరులో అవగాహన సదస్సు…
భిక్కనూరు, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి):
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం భిక్కనూరులోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సైబర్ మోసాల నుంచి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, మోసగాళ్ల వలలో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. సభకు హాజరైన వారితో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ కూడా చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రస్తుతం దొంగలు ఇళ్లలోకి చొరబడి దోచుకోవడం కంటే ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఓటీపీలు, క్యూ ఆర్ కోడ్‌లు, సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో ప్రజల బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచుకుంటున్నారని తెలిపారు. అపరిచితుల ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాలు దాల్చుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా సైబర్ భద్రతపై అవగాహన చాలా అవసరమని, ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తెలియజేయాలని కోరారు. పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు ప్రజలు సహకరించి సైబర్ మోసాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, సీఐ జగడం నరేష్, ఎస్‌ఐ ఎస్. అనిల్, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, మండలంలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ అనంతరం సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.

