జవహర్‌నగర్‌లో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ భవనాల ప్రారంభం
విద్యార్థినీ, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, పోటీ ప్రపంచంలో రాణించి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.
మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ గ్రామంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూ.2.30 కోట్లతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భవనం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాలను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు.
ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య అవసరమని, ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన బోధన అందించి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు.
విద్యార్థులకు సూచనలు
విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొంటూ ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు.
రామప్ప అభివృద్ధి పనుల పరిశీలన
అనంతరం పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం కింద రూ.61.99 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.

