25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి నగరంలోని మసాలా దినుసుల తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించింది. ప్రజల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా 13 సంస్థలను తనిఖీ చేసిన అధికారులు, హానికర రసాయనాలతో కల్తీ చేసిన 25,300 కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు అరెస్ట్.. మూడు కేసులు నమోదు
ఈ దాడుల్లో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి చొప్పున మొత్తం మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కల్తీ మసాలాల తయారీ, విక్రయాల్లో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కల్తీ ఎలా చేస్తున్నారు?
దర్యాప్తులో అజ్వైన్, జీలకర్ర, షాజీరా, లవంగాలు, ఆవాలు, సోంపు వంటి మసాలా దినుసుల్లో పారిశ్రామిక రంగులు, సింథటిక్ ఫుడ్ కలర్స్, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ తదితర తినరాని పదార్థాలను కలిపి బరువు, రంగు, ఆకర్షణ పెంచి అక్రమ లాభాలు పొందుతున్నట్లు గుర్తించారు.
దాడుల్లో స్వాధీనం చేసుకున్నవి
• 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులు
• 89,150 కిలోల ముడి పదార్థాలు
• 12 లీటర్ల రైస్ బ్రాన్ ఆయిల్
• 1.5 కిలోల సింథటిక్/ఫ్యాబ్రిక్ రంగులు
• మూడు రోలింగ్ యంత్రాలు
ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయి
ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నాణ్యత లేని లేదా కల్తీ ఆహార పదార్థాలపై సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

