📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కల్లులో మత్తు కోసం ఆల్ప్రాజోలామ్ కల్తీ ముఠా గుట్టురట్టు!

కల్లులో మత్తు కోసం ఆల్ప్రాజోలామ్ కల్తీ ముఠా గుట్టురట్టు!

రూ.25 లక్షల విలువైన ఆల్ప్రాజోలామ్ స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్.. ముగ్గురు పరారీలో

తెలంగాణ ఈగల్ (EAGLE) ఫోర్స్ కల్లులో మత్తు ప్రభావాన్ని పెంచేందుకు ఆల్ప్రాజోలామ్ అనే మానసిక ప్రభావం కలిగించే మాదక పదార్థాన్ని కలుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఛేదించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మాచా బొల్లారం ప్రాంతంలో నిర్వహించిన దాడిలో ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.25 లక్షల విలువైన 1.189 కిలోల ఆల్ప్రాజోలామ్, రూ.5.45 లక్షల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక మారుతి బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకుంది.

కల్లులో కలిపి అక్రమ లాభాలు

పోలీసుల వివరాల ప్రకారం నిందితులు ఆల్ప్రాజోలామ్‌ను భారీ మొత్తంలో కొనుగోలు చేసి కల్లు దుకాణాలు, కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కల్లులో ఈ మాదక పదార్థాన్ని కలిపి మత్తు ప్రభావాన్ని పెంచి వినియోగదారులను ఆకర్షించడం ద్వారా అక్రమంగా లాభాలు పొందుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తెల్లవారుజామున దాడి

పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటలకు మాచా బొల్లారంలోని రుక్మిణి ఎన్‌క్లేవ్ వద్ద ఈగల్ ఫోర్స్ నిఘా ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన కారులో డ్రగ్ డీల్ జరుగుతుండగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుంది.

స్వాధీనం చేసుకున్నవి
• 1.189 కిలోల ఆల్ప్రాజోలామ్
• రూ.5.45 లక్షల నగదు
• 8 మొబైల్ ఫోన్లు
• ఒక మారుతి బ్రెజ్జా కారు
• మొత్తం స్వాధీనం విలువ సుమారు రూ.25 లక్షలు

అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌పై దర్యాప్తు

ఈ ముఠాలో రియల్ ఎస్టేట్, కల్లు వ్యాపారం, బైక్ రికవరీ వంటి రంగాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కొనుగోలు, నిల్వ, రవాణా, సరఫరా కోసం ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, మాదక పదార్థం మూలాలు, ఆర్థిక లావాదేవీలు, మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కేసును ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేశారు.

సమాచారం ఇవ్వండి.. గోప్యతకు హామీ

డ్రగ్స్ అక్రమ రవాణా లేదా కల్లులో మాదక పదార్థాల కల్తీపై సమాచారం ఉంటే 1908 టోల్‌ఫ్రీ నంబర్, డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ఈగల్ ఫోర్స్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!