📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆపరేషన్ ముస్కాన్-12 విజయవంతం.. 45 మంది బాలల రక్షణ !

ఆపరేషన్ ముస్కాన్-12 విజయవంతం.. 45 మంది బాలల రక్షణ !

బాల కార్మికులను పనుల్లో పెట్టుకున్న యజమానులపై 23 కేసులు.. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపు..

కామారెడ్డి జిల్లాలో బాల కార్మికుల నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, బాలల రక్షణ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-12 విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 45 మంది బాలలను గుర్తించి రక్షించినట్లు వెల్లడించారు.

మూడు సబ్‌డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్

ఈ ఆపరేషన్‌లో కామారెడ్డి సబ్‌డివిజన్ పరిధిలో 13 మంది (12 మంది బాలురు, ఒక బాలిక), ఎల్లారెడ్డి సబ్‌డివిజన్‌లో 10 మంది బాలురు, బాన్సువాడ సబ్‌డివిజన్‌లో 22 మంది (19 మంది బాలురు, ముగ్గురు బాలికలు) రక్షించబడ్డారు. చిన్నారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించి, తదుపరి సంరక్షణ చర్యలు చేపట్టారు.

23 మంది యజమానులపై కేసులు

బాల కార్మికులను చట్టవిరుద్ధంగా పనుల్లో పెట్టుకున్న యజమానులపై జిల్లా వ్యాప్తంగా 23 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో కామారెడ్డి డివిజన్‌లో 11, ఎల్లారెడ్డి డివిజన్‌లో 4, బాన్సువాడ డివిజన్‌లో 8 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

విద్య, పునరావాసంపై ప్రత్యేక దృష్టి

రక్షించిన బాలలకు తాత్కాలిక సంరక్షణ కల్పించడంతో పాటు విద్య, పునరావాసం అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి చిన్నారి తిరిగి సాధారణ జీవితంలోకి చేరేలా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు.

శాఖల సమన్వయంతో విజయవంతం

ఆపరేషన్ ముస్కాన్-12ను పోలీసు శాఖతో పాటు కార్మిక శాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ), జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించినట్లు తెలిపారు. వివిధ బృందాలు హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, వర్క్‌షాపులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాయి.

సమాచారం అందించండి..

బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలు లేదా బాలలపై వేధింపులు, దోపిడీ వంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. “బాలల రక్షణే దేశ భవిష్యత్తు.. ప్రతి చిన్నారికి సురక్షిత బాల్యం కల్పించడం సమాజం మొత్తం బాధ్యత” అని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!