📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeLifestyleస్కూళ్ల వద్ద జంక్‌ ఫుడ్‌పై నిషేధం విధించాలి !

స్కూళ్ల వద్ద జంక్‌ ఫుడ్‌పై నిషేధం విధించాలి !

చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌, చాక్లెట్లు పిల్లల ఆరోగ్యానికి ముప్పు..

సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి: డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్

పాఠశాలల పరిసరాల్లో విక్రయిస్తున్న జంక్‌ ఫుడ్‌పై తక్షణమే నిషేధం విధించాలని తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు.

(వీడియో సోర్స్ : డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ( Facebook)

పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

పాఠశాలల వద్ద సులభంగా లభిస్తున్న చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌, చాక్లెట్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్‌, అధిక చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఆహార పదార్థాలు చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని డాక్టర్ విక్రాంత్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఇలాంటి ఆహారాలకు అలవాటు పడటం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్‌, దంత సమస్యలు, పోషకాహార లోపం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏకాగ్రతపై కూడా ప్రభావం

జంక్ ఫుడ్‌లో ఉండే కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు, ప్రిజర్వేటివ్స్ పిల్లల శారీరక ఆరోగ్యానికే కాకుండా వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నతనం నుంచే పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

జంక్ ఫుడ్‌కు బదులు పోషకాహారం

పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్ విక్రయాలను నిలిపివేసి వాటి స్థానంలో పండ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, మజ్జిగ, ఆరోగ్యకరమైన అల్పాహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల సమీపంలో ఆహార విక్రయాలపై ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయడంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా నిలవాలి

పిల్లల ఆరోగ్య రక్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అన్నారు. పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ విక్రయాలపై నిషేధం విధించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించే విధానాన్ని అమలు చేస్తే భావితరాల ఆరోగ్యానికి అది కీలక పెట్టుబడిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. పలువురు వైద్యులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆయన సూచనలకు మద్దతు తెలుపుతూ పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్ విక్రయాలపై కఠిన నియంత్రణలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!