అమృత్ పథకాన్ని కమిషన్ల పథకంగా మార్చారు.
రామాయంపేట లో తాగునీటి సంక్షోభానికి అధికారులే బాధ్యులు.
రూ.20 లక్షల బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలు.. లాగ్ బుక్‌లను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలి
కోట్లాది ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు.
రామాయంపేట , జులై 19 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ )

రామాయంపేట పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ (AMRUT) పథకం కింద రూ.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్త పైప్‌లైన్లు వేయడం, ఎంపీడీవో కార్యాలయం వద్ద 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది.
అయితే ప్రభుత్వం ఆమోదించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), ఒప్పంద నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ మున్సిపల్ ఏఈ, కమిషనర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అమృత్ పథకాన్ని అవినీతి కేంద్రంగా మార్చారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తీవ్ర ఆరోపణలు చేశారు.
ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, పనులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు విధులను విస్మరించి కమిషన్లకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. ప్రధాన కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు పనుల వద్ద కనిపించకుండా సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నాసిరకం పనులు చేయించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
డీపీఆర్ ప్రకారం ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా పైప్‌లైన్ ఉన్న ప్రాంతాల్లో తిరిగి పైప్‌లైన్లు వేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఉల్లంఘించారని అన్నారు. నీటి సౌకర్యం లేని ప్రాంతాలను విస్మరించి ఇప్పటికే పైప్‌లైన్ ఉన్న ప్రాంతాల్లోనే మళ్లీ తవ్వకాలు చేసి నాసిరకం పైపులు వేసి భారీ బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు.
టీచర్స్ కాలనీలో అసంపూర్తిగా వదిలేసిన పైప్‌లైన్ పనులను పూర్తి చేయకుండా, మంజీరా స్కూల్ ప్రాంతం, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వరకు ఇప్పటికే నీరు సరఫరా అవుతున్న లైన్ల పక్కనే కొత్త పైప్‌లైన్లు వేసి ప్రభుత్వ నిధులను వృథా చేశారని పేర్కొన్నారు.
రామాయంపేట పట్టణానికి రోజుకు సుమారు 23 లక్షల లీటర్ల తాగునీరు అవసరం ఉండగా, వాస్తవంగా 10 లక్షల లీటర్ల కన్నా తక్కువ నీరే వస్తోందని తెలిపారు. అయినప్పటికీ మిషన్ భగీరథ లాగ్‌బుక్‌లో మాత్రం 23 లక్షల లీటర్లు వచ్చినట్లు నమోదు చేసి, ప్రతి వారం అధికారులు సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ లాగ్‌బుక్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
అమృత్ పథకం కింద కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నప్పటికీ వాటిని నింపేందుకు అవసరమైన అదనపు నీటి కేటాయింపును మిషన్ భగీరథ నుంచి ఇప్పటివరకు తీసుకురాకపోవడం అధికారుల ఘోర వైఫల్యమని విమర్శించారు. నీటి వనరు లేకుండా ట్యాంకులు నిర్మించడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు.
2017లో మిషన్ భగీరథ పథకం కింద రూ.7.5 కోట్లతో 49 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించినప్పటికీ ప్రణాళికా లోపాలు, నాణ్యతలేని పనుల కారణంగా టీచర్స్ కాలనీ, చిత్తారమ్మ బస్తీ, అక్కల బస్తీ, మరుకు బస్తీ, రాజేందర్ నగర్, గాంధీ రోడ్, కోమటిపల్లి, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ ఆసుపత్రి, గర్ల్స్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర తాగునీటి సమస్య కొనసాగుతోందని తెలిపారు.
రామాయంపేటలో ఉన్న 10 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా సక్రమంగా శుభ్రం చేయడం లేదని, అదే సమయంలో రూ.20 లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
మిషన్ భగీరథ, అమృత్ పథకాలు సక్రమంగా అమలై ఉంటే ఈరోజు రామాయంపేట పట్టణంలోని ప్రతి ఇంటికి రోజుకు రెండు పూటలా తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉండేది. కానీ అధికారుల నిర్లక్ష్యం, నాణ్యతలేని పనులు, ప్రణాళికా లోపాల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడంతో పాటు ప్రజలు ఇప్పటికీ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఒకవైపు కోట్ల రూపాయలతో తాగునీటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూనే, మరోవైపు నీటి కొరతను తీర్చేందుకు మున్సిపాలిటీ బోర్‌వెల్లు, మోటార్లు ఏర్పాటు చేసి ప్రతి నెల లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించడం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు.
ట్యాంకుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, డీపీఆర్‌కు విరుద్ధంగా పనులు, తప్పుడు లాగ్‌బుక్ నమోదు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జరిగిన అవకతవకలపై విజిలెన్స్, ఏసీబీ లేదా ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీతో సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన మున్సిపల్ ఏఈ, కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాగి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల తాగునీటి హక్కుతో చెలగాట మాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవసరమైతే అన్ని ఆధారాలతో ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ న్యాయపోరాటం, ప్రజా ఉద్యమం చేపడతామని రాగి రాములు హెచ్చరించారు.

